ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కోనసీమ జిల్లా (Konaseema District) పేరు మార్పుపై పెను దుమారమే రేగిన సంగతి అందరికీ తెలిసిందే. అమలాపురంలో జరిగిన అల్లర్లలో ఆందోళనకారులు ఏకంగా మంత్రి ఇంటికే నిప్పంటించడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆందోళనకారుల దాడిలో ఎస్పీ స్థాయి అధికారులకు కూడా గాయాలవడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటివరకు 200 మందికిపైగా కేసులు నమోదు చేశారు. అయితే, తాజాగా మంత్రి పినిపె విశ్వరూప్ అనుచరులకు ఈ కేసుతో సంబంధం ఉందంటూ పోలీసులు నిగ్గు తేల్చారు.
వైఎస్సార్‌సీపీ నేతలు నలుగురిపై కేసులు నమోదైనట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో A225గా సత్యరుషి, A226గా సుభాష్, A227గా మురళీకృష్ణ, A228గా రఘుపై కేసులు నమోదయ్యాయి. A222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు ఈ నలుగురు వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయమై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 258 మంది నిందితులను గుర్తించామని వారిలో 142 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పరారీలో 116 మంది ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా అమలాపురంలో పర్యటించిన డీజీపీ.. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మె్ల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను, కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించి పోలీసులతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్, మీడియా విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని చెప్పారు.
అల్లర్ల నేపథ్యంలో చాలా రోజుల పాటు అమలాపురం పోలీసుల అష్టదిగ్బంధంలోనే ఉంది. ఈ వివాదంపై టీడీపీ(TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) నేతలు స్పందిస్తూ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం అల్లర్లకు ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా జిల్లా పేరు మార్పు చేయడం వలనే ఇలాంటి ఘోరమైన ఘటనలు జరిగాయని.. ఇంటెలిజన్స్ వర్గం ఏం చేస్తుందంటూ అప్పట్లో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి వైఎస్సార్‌సీపీ కూడా ఘాటుగానే స్పందించింది. మొన్నటివరకు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయి ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. విడియోలు, వాట్సాప్ గ్రూపుల ఆధారంగా మరింత మంది నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist