ఏపీ అసెంబ్లీ (AP Assembly) ముగిసినా వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత మద్యం.. ఆ తర్వాత మూడు రాజధానుల అంశాలపై ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదు. వైసీపీ నేతల చదువులు, రాజధాని బిల్లులపై టీడీపీ నేత నారా లోకేష్ చేసిన కామెంట్స్ కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను విమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్న నాని.. దమ్ముంటే గుడివాడలో నామీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలని పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని స్పష్టంగా, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పారని.., దీనిపై ఎమ్మెల్య్లు గా కూడా గెలవలేని బచ్చాగాళ్లు, ప్రజల్లో ఆదరణ కూడా లేని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వారు సీఎం గురించి నోటి కొచ్చిమాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు విజనరీనే ఉంటే.. తన కొడుకుని ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలిపించలేకపోయారో చెప్పాలన్నారు. జగన్ ఏం చదివారు, ఏ క్లాసులో పాస్ అయ్యారు.. అనేది అసెంబ్లీ సాక్షిగా మీ తండ్రి చంద్రబాబుకు గతంలోనే చెప్పారని.. నీలాగా రికమండేషన్ మీద ఊళ్లోవాళ్లు కట్టిన ఫీజులతో విదేశాలల్ చదవలేదని లోకేష్ ను విమర్శించారు. జగన్ ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగారన్నారు. బాబాయిని బంధించింది, తాతాను చంపిందీ మీరేనని ఆరోపించారు.
16 నెలలు అక్రమంగా జైలులో పెట్టినా జగన్ ఏనాడూ వెన్ను చూపలేదని.., ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వారికి జగన్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేషకు.. 151మంది ఎమ్మెల్యేలను గెలిపించి సీఎం జగన్ కి ఎక్కడా పోలిక లేదని కొడాలి నాని అన్నారు.
ఏ వ్యవస్థ అయినా మరో వ్యవస్థలో జోక్యం చేసుకోనంతవరకూ బాగానే ఉంటుందని., అలాకాదని జోక్యం చేసుకుంటే అనేక వివాదాలు ఏర్పడి రాష్ట్రం నష్టపోతుందన్నారు మంత్రి కొడాలి నాని. కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేరే వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదన్నారు.
న్యాయ స్థానాలపై అపారమైన గౌరవం ఉందని, ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తామని మాత్రమే సీఎం చెప్పారని.. చట్టాలు చేసే హక్కు శాసనసభకు, పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, చట్టసభకు హక్కులు ఉన్నాయని అసెంబ్లీలో చెబితే, దానిపైనా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, Nara Lokesh