టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ (YSRCP) మండిపడుతోంది. చంద్రబాబు ఆరోపణలకు మంత్రులు, ఆ పార్టీ నేతలు కౌంటర్లిస్తున్నారు. విశాఖకు రాజధాని కావాలా.. అభివృద్ధి కావాలా అంటూ వైజాగ్ వాసులకు చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం రుచి మరిగిన పులికి, వేటాడటానికి మనుషులు దొరక్కపోతే ఏ రకంగా పిచ్చెక్కుతుందో... అధికారం పోయిన చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును... అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నాం... దీనికి ఆయన ఏం సమాధానం చెపుతారంటూ ప్రశ్నించారు.
దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు... అది కూడా కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక... చివరికి దేశంలో కెల్లా అత్యధిక ధరలు, పన్నులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు... డీబీటీలు లేవు. జన్మభూమి కమిటీల దోపిడి కింద స్థాయిలో... జల యజ్ఞం దోపిడీ, రాజధాని పేరిట దోపిడీ, ఇసుక పేరిట దోపిడి, మద్యం పేరిట దోపిడి పై స్థాయిలో ఉన్నాయని అమర్ నాథఅ ఆరోపించారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల్లో జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, 31 లక్షల ఇళ్ళ నిర్మాణం, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు... ఇలాంటి స్కీముల ఏ ఒక్కటి అయినా ఉన్నాయా? మరి ఏ స్కీములూ లేకపోయినా ఇంతే ఆదాయం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బంతా ఏం చేసింది? తినేసింది అనే కదా? అని నిలదీశారు మంత్రి అమర్ నాథ్.
ఈ రోజు కాకపోతే రేపు.. ప్రజల అభీష్టం మేరకు, డీ సెంట్రలైజేషన్ ఖాయమని.., .. విశాఖకు రాజధాని వెళ్ళటం ఖాయమని అర్ధమవుతుంటే.. అమరావతిలో తన బినామీల కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బినామీల కోసం విశాఖను, ఉత్తరాంధ్రను త్యాగం చేయమని అడుగుతున్నారన్నారు.
“చంద్రబాబు కంటే ఐరన్ లెగ్ తెలుగుదేశం పార్టీకి ఎవరుంటారు? రాష్ట్రానికి ఎవరుంటారు? తన కొడుకు ఐరన్ లెగ్–2 అని గమనించిన తరవాతే కదా పుత్రుడిమీద కంటే దత్త పుత్రుడి మీద నమ్మకాలు ఎక్కువ పెట్టుకున్నాడు! తన మీద తనకు నమ్మకం లేకే కదా... పవన్ కల్యాణ్‌కు మళ్ళీ కన్ను కొడుతున్నాడు” అని ఆరోపించారు. విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి... అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలకు, కుతంత్రాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Ysrcp