M Bala Krishna, News18, Hyderabad
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పూర్తై రోజులు గడుస్తునా ఇంకా అక్కడక్కడా అసంతృప్తులు వ్యక్తమవుతూనే ఉన్నాయి. పదవులు కోల్పోయిన వారి మాటెలా ఉన్నా.. తిరిగి మంత్రి పదవి దక్కించుకున్న నేతలల్లో మాత్రం కాస్త అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా తమకు కేటాయించిన శాఖలపై పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎం జగన్ (CM YS Jagan)కు బొత్స.. కీలకమైన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖను కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు మూడు రాజధానులు, పట్టణాల్లో సౌకర్యాల వంటి కీలక అంశాల్లో మంత్రిగా బొత్స మార్క్ చూపించారు. ఐతే కేబినెట్ మార్పులు, చేర్పుల్లో భాగంగా బొత్సను పదవి నుంచి తప్పించాలని జగన్ నిర్ణయం తీసుకున్నా.. ఆతర్వాత పలు కారణాల దృష్ట్యా కొనసాగించారు.
ఐతే మంత్రి పదవి దక్కినా బొత్సకు మాత్రం సంతృప్తి లేదట. గతంలో ఎంతో కీలకమైన మున్సిపల్ శాఖ ఇచ్చినప్పటికీ రెండో విడతలో విద్యాశాఖ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే శాఖను కేటాయించినా ఇంతవరకు ఆయన శాఖాపరమైన సమీక్ష నిర్వహించలేదట. విద్యాశాఖ అంశాలను ప్రస్తావించినా తర్వాత చూద్దాంలే అంటూ అయిష్టంగానే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
విద్యాశాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శాఖలో దాదాపు నాలుగు సార్లు శాఖాపరమైన రివ్యూలు జరిగిన ఒక్కటంటే ఒక్క రివ్యూలో కూడా బొత్స పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు విద్యాశాఖ కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చిన తర్వాత సీఎంను కలవాలని భావించినా అది కుదర్లేదట. అంతెందుకు మంత్రిగా తొలిసారి జిల్లాకు వెళ్లినప్పుడు అభిమానులు ర్యాలీ నిర్వహించాలనుకున్నా బొత్స వద్దన్నారట.
బొత్సతో మంత్రి రోజా కూడా తనకు కేటాయించిన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన విడదల రజినికి ఎంతో కీలకమైన వైద్య శాఖ ఇవ్వడం తనకు అసలు ప్రాధాన్యత లేని టూరిజం శాఖ అప్పజెప్పడంపై ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోజా తొలిత నుంచి తనకు హోం శాఖ కట్టబెడతారనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశాఖ తానేటి వనిత చేతుల్లోకి వెళ్లింది. ఇదిలా ఉంటే కొందరు మాత్రులు మాత్రం కీలక శాఖలు దక్కించుకొని జాక్ పాట్ కొట్టినట్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మంత్రులగా పదవులు వచ్చి కేబినెట్లో కొనసాగుతున్నా వైసీపీతో మాత్రం అసంతృప్తి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP cabinet, Botsa satyanarayana