ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu) కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. హత్య ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎప్పుడు జరిగింది..? అనే విషయాలన కాకినాడ జిల్లా (Kakinada District) ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఈనెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. శ్రీరామ్‍నగర్‍లో మిత్రులతో కలిసి సుబ్రమణ్యం మద్యం సేవించాడని ఎస్పీ తెలిపారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చాడని.. సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లారని.. అర్ధరాత్రి అనంతబాబు ఇంటివైపు కారులో వెళ్లారని వివరించారు. సుబ్రమణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు కొంత డబ్బులిచ్చారని.. తీసుకున్న డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పద్ధతి మార్చుకోవాలని సుబ్రమణ్యంకు అనంతబాబు చెప్పగా.. అతడు తిరగబడ్డాడు. దీంతో అంతబాబు అతడ్ని వెనక్కి నెట్టగా.. తలకు గాయమైంది.
ఐతే సుబ్రహ్మణ్యం మరోసారి లేచి అనంతబాబు మీదకు రాగా.. వెనక్కి అనంతబాబు వెనక్కి నెట్టినప్పుడు గ్రిల్‍కు తగిలి సుబ్రమణ్యం తలకు గాయమైంది. గాయపడిన సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లాడు.. వెక్కిళ్లు రావడంతో నీళ్లు ఇచ్చాడు. సుబ్రమణ్యం చనిపోవడంతో అనంతబాబు షాక్‍కు గురయ్యాడు. ఇదే సమయంలో అనంతబాబుకు గతంలో జరిగిన ఘటనలు గుర్తొచ్చాయి. గతంలో సుబ్రహ్మణ్యం మద్యం తాగి యాక్సిడెంట్లు చేశాడు. అందుకే హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించాడు. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు.. ప్రమాదంలో ఉండాలని సుబ్రహ్మణ్యం శరీరంపై కర్రతో కొట్టాడు.
అనంతరం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిందని.. తాను ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చాడు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబబుపై సెక్షన్ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోదు చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. ఇదిలా ఉంటే కాకినాడ ప్రత్యేక మొబైల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చల్లా జానకి ఎదుట ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఎమ్మెల్సీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అనంతబాబు కేసులో మూడు రోజుల పాటు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం హత్య తర్వాత అనంతబాబును అరెస్ట్ చేయకపోవడం, ఆయన చక్కగా శుభకార్యాలకు హాజరుకావడంపై తీవ్రదురమారం రేగింది. దీంతో పోలీసులు అనంతబాబుపై హత్య కేసు నమోదు చేయడంతో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టంకు అంగీకరించారు. ఐతే పోలీసులు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని మృతుని భార్య, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada