ఏపీలో పొత్తులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీని అడ్డుకోవాలంటే అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి వెళ్లాలని.. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతోందని సూచించారు. మోదీ, జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తమ వ్యతిరేక పార్టీతో పెట్టుకున్న జనసేనను(Janasena).. వామపక్ష పార్టీలతో కలిసి రావాలని నారాయణ(CPI Narayana) కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ.. అన్ని పార్టీలు దాదాపుగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవడంతో రాజకీయ వాతావరణం ఏర్పడింది.
టీడీపీ (TDP) జనసేనతో పొత్తు పెట్టుకుంటుందా ? లేదా అనే డైలమా కొనసాగుతోంది. తమతో జనసేన కలిసి వస్తే.. మరోసారి రాష్ట్రంలో అధికారం తమదే అనే టీడీపీ భావిస్తుంటే.. బీజేపీ (BJP) మాత్రం జనసేన తాము కలిసి ఎన్నికలు వెళ్లాలని.. తమ కూటమిలో టీడీపీకి ఛాన్స్ లేదని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో వామపక్షాలు పొత్తు కోసం టీడీపీ వైపు చూస్తున్నాయా ? అనే చర్చ జరుగుతోంది. జనసేన కలిసొచ్చినా రాకపోయినా.. తాము మాత్రం టీడీపీతో కలిసి వెళితే ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం ఉంటుందని వామపక్షాలు, అందులోనూ సీపీఐ భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి.
గత ఎన్నికల్లో వామపక్షాలు జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టడంతో.. వీరికి పెద్దగా రాజకీయ ప్రయోజనం కలగలేదు. ఎన్నికలకు ముగిసిన కొద్దికాలానికే వామపక్షాలకు గుడ్ బై చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. బీజేపీతో స్నేహబంధం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య మైత్రి కొనసాగుతోంది. వీరి స్నేహబంధం మధ్య అప్పుడప్పుడు అభిప్రాయాలు భేదాలు తలెత్తినా.. బీజేపీ మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో ఉంటారని ధీమాగా చెబుతోంది.
Cm Jagan: శ్రీకాకుళంలో శాశ్వత భూహక్కు పత్రాల పంపిణీ..సీఎం జగన్ కీలక ప్రకటన
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనను కలిశారు. దీంతో జనసేన, బీజేపీ కలిసే ఎన్నికలకు వెళతాయని.. తమతో టీడీపీ ఉండదని బీజేేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీతో కలిసి వెళ్లేందుకు వామపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయా ? అందుకే సీపీఐ నారాయణ ఇలా మాట్లాడారా ? అనే టాక్ వినిపిస్తోంది. ఇక తన సొంత ప్రాంతమైన నగరి నుంచి అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్న నారాయణ.. చాలాకాలంగా ఆ ప్రాంతంలో పర్యటనలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CPI Narayana