జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలు అంత తేలికగా అర్థంకావు. ఏపీలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుందన్న విషయం ఆయనకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చెప్పొచ్చు. అందుకే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. జనసేనతో(Janasena) పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీతో పాటు జనసేనను కూడా టార్గెట్ చేస్తోంది అధికార వైసీపీ. ఏపీలో కొంతమేర ప్రభావం చూపే జనసేన.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు తన మార్కును చూపించలేకపోయింది. అయితే తెలంగాణలోనూ తన పార్టీని విస్తరిస్తానని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలోనూ(Telangana) పోటీ చేసి తీరుతామని ప్రకటించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. చనిపోయిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు. గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తెలగాణలో పోటీ చేయలేక పోయామని చెప్పారు. రానున్న ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో జనసెన పార్టీ బరిలో ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపిచ్చారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అయితే ఏపీలో పొత్తుపై క్లారిటీ ఉన్నా.. తెలంగాణలో మాత్రం గందరగోళం ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వబోమని మొదట ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ తరువాత బీజేపీకి మద్దతు ప్రకటించి.. పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే తర్వాత కూడా తెలంగాణలో బీజేపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన బీమ్లానాయక్ సినిమా ఈవెంట్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ బీజేపీ కంటే ఎక్కువగా టీఆర్ఎస్కే ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా ఆయన తెలంగాణలో పోటీ చేస్తామని.. కనీసం 20 శాతం స్థానాల్లో బరిలో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. దీంతో అసలు తెలంగాణ రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
తెలంగాణకు ప్రధాని మోదీ.. నెల రోజుల్లో ముగ్గురు కీలక నేతల టూర్.. బీజేపీ అంత సీరియస్గా తీసుకుందా ?
Hyderabad Traffic Diversion: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వచ్చే 3 నెలల పాటు..
అయితే తన వ్యూహం ద్వారా బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా ? లేక టీఆర్ఎస్ను ఇబ్బందిపెట్టాలని అనుకుంటున్నారా ? అన్నది అర్థంకావడం లేదు. తెలంగాణలో జనసేన బలపడాలని భావిస్తే.. ఏపీ తరహాలోనే ఆ పార్టీ బీజేపీతో కలిసి వెళుతుందా ? అన్నది పెద్ద చర్చ. అయితే తెలంగాణ బీజేపీ మాత్రం ఆంధ్ర మూలాలు ఉన్న ఏ పార్టీతోనూ పొత్తు వద్దు అని చెబుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తన పోటీ ద్వారా టీఆర్ఎస్ను ఇబ్బందిపెట్టే ఆలోచనలో ఉన్నారా ? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే రాజకీయాల్లో నిలకడ ప్రదర్శించని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రధాన రాజకీయా పార్టీ అంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా ? అనే వాదన కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.