ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన.. ఆ పార్టీతో కలిసి పోరాటాలు చేసే విషయంలో మాత్రం అంటీముట్టనట్టుగానే ఉంటోందనే వాదన ఉంది. ఎప్పుడో ఒకసారి రెండు పార్టీల నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కలిసి నడుద్దామని అనుకోవడం తప్పితే.. ఈ రెండు పార్టీలు నిజంగానే క్షేత్రస్థాయిలో కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలతో ఏపీలో బీజేపీ గ్రాఫ్ బాగా తగ్గిపోయిందనే భావనలో జనసేన ఉందని.. అందుకే ఆ పార్టీకి దూరం దూరం అన్నట్టుగానే ఉంటోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి విశాఖ వెళుతున్నారని ఆ పార్టీ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో విశాఖ లో పర్యటిస్తారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతారన్నారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులతో మాట్లాడి వారిని ఒప్పిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇన్ని రోజులు ఓపికగా పరిస్థితి వేచి చూశామని.. ఇప్పుడు తమ స్వరం వినిపిస్తున్నామని అన్నారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌పై కేసులు లేవని.. రాజీలు కోసం కలవలేదని... రాష్ట్ర సమస్యలపై బలంగా వాణిని వినిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ వచ్చిన తరువాత వచ్చిన సమస్యలు మరెప్పుడు రాలేదన్నారు.
అమరావతి రైతులు ఉద్యమం పట్ల కూడా జనసేన వైఖరి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు అధికార పార్టీపై పోరాటానికి భయపడుతున్నాయని...తాము భయపడటంలేదని అన్నారు. ఇన్ని రోజులు వేచి చూసారని..ఇంకొద్ది రోజులు వేచి చేస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయబోయే ఉద్యమానికి బీజేపీ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..
YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?
కాబట్టి ఇది పూర్తిగా జనసేన రాజకీయ కార్యక్రమంగా ఉండబోతోందని అర్థమవుతోంది. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనే పవన్ కళ్యాణ్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా ? లేక ఈ విషయంలో మౌనంగా ఉంటోందని ఏపీలోని అధికార వైసీపీ తీరుపై మండిపడతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబడితే.. రాజకీయంగా ఆయన బీజేపీకి షాక్ ఇవ్వనున్నారని అనుకోవచ్చని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Janasena, Pawan kalyan, Vizag Steel Plant