Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ వాతావరణం చూస్తే.. ఎన్నికల సీన్ ను తలపిస్తోంది. అన్ని పార్టీలు అప్పుడే ప్రచారాలు మొదలుపెట్టేస్తున్నాయి. సాధారణంగా అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు ఖాయం అంటూ ప్రాచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam) మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. అంతా సిద్ధంగా ఉండాలి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తోంది. అయితే అధికార వైసీపీ (YCP) మాత్రం ముందస్తు ఎన్నికలు ఉంటాయని.. ఉండవని ఏం చెప్పడం లేదు. కానీ పార్టీ వ్యూహాలు చూస్తే ఏ క్షణంలోనైనా ఎన్నికలకు వెళ్లచ్చనే అభిప్రాయం కలిగేలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ నేతలంతా గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక 17 మంది మంత్రులు.. సామాజిక న్యాయ భేరి అంటూ.. బస్సు యాత్ర మొదలెట్టారు. ఆయా సామాజిక వర్దాల ఓట్లపై ఫోకస్ చేస్తున్నారు.. ఇలా అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రెండు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ లు వేస్తున్నాయి. ఈ రేసులో జనసేన (Janasena) కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కౌలు రైతులకు సహాయం పేరుతో జనసేన అధినేత పవన్ గ్రామాల బాట పట్టినా.. అప్పుడప్పుడు మాత్రమే.. నిత్యం ప్రజలకు చేరువాలో ఉండడం లేదు. దీంతో ఈ జూన్ నుంచి జనసేన సైతం జనాల్లోనే ఉండాలని నిర్ణయించింది.
పార్టీ అధినేత పవన్ సినిమాలో కాస్త బిజీగా ఉన్నారు. దీంతో ఆ బాధ్యతను ఆయన అన్నయ్య.. జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు తీసుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా (Srikakulam Distrct), జూన్ 2న విజయనగరం జిల్లా (Vizianagaram District), జూన్ 3న విశాఖ జిల్లా (Visakha District)ల్లో నాగబాబు (Nagababu) పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. మొత్తం మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, వీర మహిళలకు నాగబాబు అందుబాటులో ఉండేలా ఈ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు.
జూన్ 1 నుండి నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన.. pic.twitter.com/WAHVozSuyS
— JanaSena Party (@JanaSenaParty) May 29, 2022
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నాగబాబు ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించనున్నారు. ఇటీవల మెగా అభిమానులు అంతా సమావేశం అయ్యి.. పవన్ ను సీఎం చేయాలని నిర్ణయించారు. అలాగే నాగబాబు పర్యటనలో సైతం మెగా అభిమానులందరితో నాగబాబు సమావేశం కానున్నారు. అంతా కలిసి పార్టీ ఎదుగుదలకు దోహదపడే అంశాలను నాగబాబు వివరించనున్నారు.
ఇదీ చదవండి : వాట్సప్ మెసేజ్ లతోనే విధ్వంసం.. అల్లర్లకు ముందేప్లాన్.. మరో వారం పాటు 144 సెక్షన్
జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను నాగబాబు పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అంతర్గత సమావేశాల్లో పొత్తుల గురించి ఏం చెబుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Mega brother nagababu