Janasena: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit)చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార వైసీపీ (YCP) సమ్మిట్ సూపర్ సక్సెస్ అంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెట్టుబడలన్నీ బూటకం అంటున్నాయి. ముఖ్యంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఈ సమ్మిట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ (Visakha) లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అంటూ ఏపీ ప్రభుత్వం చెప్పుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాజా పెట్టుబడుల సదస్సు ఓ అంకెల గారడీ అన్నారు. అక్కడితోనే ఆగలేదు ప్రభుత్వం చెబుతున్నది అంతా అభూత కల్పన అని కొట్టిపారేశారు. ఇప్పటికే ప్రారంభమయ్యాయి అని చెప్పుకునే కంపెనీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపించడం మోసం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం తాజా 14 ప్రారంభోత్సవాల్లో 8 శ్రీసిటీలోనివేనని అన్నారు. కృష్ణపట్నం వద్ద స్టీల్ ప్లాంట్ కోసం గతంలోనే ఎంఓయూ చేసుకుని, ఇప్పుడు దాన్ని మరోసారి చూపించారని వివరించారు. తిరుపతి , విశాఖల్లో ఓబెయార్ సంస్థకు గతంలోనే భూములు కేటాయించగా, నిర్మాణాలు కూడా జరిగాయని.. కానీ ఇప్పుడు విశాఖలో ఎంఓయూ చేసుకున్నారని.. 30 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటనలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి రాజధాని లేదని, సరైన నాయకత్వం కూడా లేదని, ఇలాంటి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో ఏ విధంగా నమ్మకం కలుగుతుందో చెప్పాలని నాదెండ్ల ప్రశ్నించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో.. కేవలం పబ్లిసిటీ కోసం ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు పేరిట రెండ్రోజుల్లో 175 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసిందని విమర్శించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డును ఇంకా మర్చిపోలేక పోతున్నారని సెటైర్లు వేశారు. వారి శాఖ విడుదల చేసిన ప్రకటనల సీఫుడ్ లో కోడిగుడ్లను కూడా కలిపేశారని ఆరోపించారు. సీఫుడ్ అంటే చేపలు, రొయ్యలు అని తెలుసని, మరి కోడిగుడ్డు ఆ జాబితాలోకి ఎలా చేరాయని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి : టీడీపీలో చేరిన ఆయన సీటు ఫిక్స్ చేసుకున్నారా..? ఆ మంత్రిపై పోటీకి సై అంటున్నారా..?
విపక్షాల విమర్శలపై మంత్రులు అదే స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో సమ్మిట్ లు నిర్వహించారని, అయితే మరెవ్వరూ నిర్వహించనట్లుగా వాటి గురించి ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని అన్నారు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదని, తమలా చేసి చూపించాలని అన్నారు. విశాఖలో చాలా క్రమశిక్షణతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను సీఎం జగన్ నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని, హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా విపక్షాలు విమర్శలు మాని.. వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి బొత్స హితవు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Botsa satyanarayana, Nadendla Manohar