Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం వేడి పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన (Janasena) కేవలం ఒక్క సీటే నెగ్గినా.. ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి చేరడంతో.. పవన్ పార్టీకి ఘోర అవమానం జరిగింది. ఆ అవమానానికి ఈ ఎన్నికల్లో సమాధానం చెప్పాలని.. ఎలాగైనా వైసీపీని గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంకణం కట్టుకున్నారు. ఆయనే స్వయంగా ఈ మాట చెబుతున్నారు. పార్టీ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి ఎదురవ్వడం.. జనసైనికులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సారి కూడా పవన్ నెగ్గకపోతే.. రాజకీయంగా మనుగడ కష్టమే..
అందుకే ఈసారి కచ్చితంగా పవన్ గెలిచి తీరాలనే కసితో ఉన్నారు ఆయన అభిమానులు.. దీంతో ఆయన ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. గతంలో లాగా రెండుచోట్ల పోటీచేస్తారా? సేఫ్ ప్లేస్ లో పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెడతారా? టీడీపీతో పొత్తుతో ఈసారి పవన్ ఎమ్మెల్యే అవుతారా? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా ఏపీ మంత్రి అమర్నాథ్ పవన్ ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ 175నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే నేను అన్నీ వదులుకుని వెళ్లిపోతాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడు.. అప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పగలరా…? కనీసం పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : గాడిద మాంసానికి ఏపీలో ఫుల్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే..?
కేవలం విపక్షాలే కాదు.. పవన్ అభిమానులు సైతం అధినేత ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే లాజిక్‌తో మళ్లీ ఆ రెండు స్థానాల్లోనే ఆయన పోటీ చేస్తారని కొందరు అంటుంటే.. ఒకచోట నుంచే పవన్ పోటీచేస్తారని అంటున్నారు. భీమవరం, గాజువాక కాదని వేరేచోట నుంచి పవన్ బరిలో దిగినా ఓటమి భయంతోనే నియోజకవర్గం మార్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికైతే ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నదానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నా.. ఓ నిర్ణయానికి అయితే వచ్చి ఉంటారని ఆయన అభిమానులు అంటున్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అంటున్న వైసీపీ వాళ్లకే ముందు సమాచారం ఇస్తానని పవన్ కౌంటర్ ఇవ్వడం డా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై పవన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థాగత నిర్మాణం సహా సమస్యలపై పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు పవన్. ప్రతి నియోజకవర్గానికి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న పవన్ బీజేపీ లేకుండానే తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సమాలోచనలు జరపుతున్నారు. పిఠాపురం నుంచి అయితే తనకు సేఫ్ అని పవన్ భావిస్తున్నారు. ఈమేరకు సర్వే కూడా పూర్తయిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించారు. 151 సీట్లు సాధించిన జగన్మోహన్రెడ్డి హవాలో ఇన్ని ఓట్లు సాధించడం గొప్ప అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తే ఆ ప్రభావం కాకినాడ అర్బన్, రూరల్, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాలపై ఉంటుందని, వీరంతా విజయం సాధిస్తారని అంటున్నారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు విషయంలో క్లారిటీ.. అధికారులు ఏమన్నారంటే..?
ఈసారి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమయినంత ఎక్కువ సీట్లు సాధించాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీచేస్తే ఓడించేందుకు వైసీపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. అలాగే భీమవరం నుంచి కూడా పోటీ చేయాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నుంచి పోటీ చేస్తే రికార్డు విజయం కట్టబెట్టేలా చేసే బాధ్యత తమది అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan