Anna Raghu, Guntur, News18.
Pawan Target 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మొదలైంది. ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ మాత్రం కాదనే సంకేతాలు అందేలా చేస్తున్నాయి అన్ని పార్టీలు.. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన.. ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో అధికారం తన లక్ష్యం కాదని చెబుతూ వచ్చిన పవన్.. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అని కచ్చితంగా చెబుతున్నారు. తాజాగా ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం వింటే.. చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారం.. భారతీయ జనతా పార్టీ అడుగుజాడల్లో నడుస్తానని తేటతెల్లం చేశారు. పవన్ చేసిన ప్రసంగం రాజకీయ విమర్శకులను సైతం ఆకట్టుకుందనే చెప్పాలి. గతంలోలా ఎక్కడా ఆవేశ పడినట్టు కనిపించలేదు. ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా సాగిన ప్రసంగంలో అధికార పక్షాన్ని ఎండగట్టారు. ఇసుక, మైనింగ్, నిరుద్యోగం, కబ్జాలు,దోపిడీలు వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకుంటున్ననిర్ణయాలు, అధికారంలోకి వచ్చాక చేయబోయే పనుల గురించి పవన్ మాట్లాడేటప్పుడు ఆయనలో ఆత్మవిశ్వాసం కనిపించింది.
గతంలో పవన్ ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యక్తిగత ధూషణలు, అరుపులు, కేకలతో ఆయన అభిమానులను ఉర్రూతలూగించే విధంగా ఉండేది.. కానీ ఈసారి రాజకీయ విశ్లేషకులు సైతం.. సరిగ్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడారు అంటూ చెబుతున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, మ్యానిఫెస్ట్, అభివృద్ధి, అధికారపక్షం వైఫల్యాలు ఇలా వరుసక్రమంలో సాగింది ఆయన ప్రసంగం.
ఇదీ చదవండి : ఆశగా చేపల కోసం వల వేశారు.. కానీ ఇవి చిక్కాయి.. వీటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
తాము అధికారం లోకి రావడానికి సహకరించే వారితో పొత్తులు ఉంటాయంటూ పవన్ వదిలిన బాణం టీడీపీని ఆశల పల్లకిలో పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తాను సహకరించానని గుర్తుచేస్తూనే.. ఈ సారి తాము అధికారంలోకి రావడానికి ఎవరు సహకరించినా వారితో పొత్తు పెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చదవండి : పార్టీ పెట్టక ముందే కుమ్ములాటా..? బ్రదర్ అనిల్ సమావేశంపై ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
ప్రస్తుతం తాను బీజేపీతోనే కలిసి ఉన్నానని చెప్పేందుకు పవన్ సంకోచించలేదు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందన్నారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ 2024 లో కూడా వరుసగా మూడోసారి అధికారం నిలబెట్టుకుంటుందనే ధీమాలో ఉన్నారు. ఉమ్మడి శత్రువైన జగన్ ను ఎదుర్కొనేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం అంటూనే.. ఎవరైనా సరే తమకు మద్దతు ఇవ్వవలసిందే అంటూ టీడీపీకి కూడా సూచన ప్రాయంగా తెలియజేశారు.
ఇదీ చదవండి : సీఎం మోసం ఖరీదు ఎంతో తెలుసా..? శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ లోకేష్ ఫైర్
ఈ సారి ఎన్ని పొత్తులు పొడిచినా ప్రభుత్వ వ్యతిరేక పక్షాలు అన్నీజనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వవలసిందేనని, తాము మద్దతు ఇచ్చి ఇతరులకు అధికారం అప్పగించబోమని పరోక్షంగా టీడీపీకి ఓ సందేశం పంపారు. పార్టీ భవిష్యత్తు పై చావో రేవో తొల్చుకోవలసిన టీడీపీ సీఎం కుర్చీలో పవన్ ను కూర్చోబెట్టి తాను పక్కన కూర్చోడానికి సిద్ధపడుతుందా..? అలా అని పవన్ తో పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేసే సాహసం చేస్తుందా..? లేక పోతే జగన్ మళ్ళీ గెలిచినా ఈ సారి చూద్దాంలే అని టీడీపీ మరో ఐదేళ్ళు మౌనంగా ఉంటుందా అని చూడాలి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp-janasena, Pawan kalyan, TDP