‘ఇన్నాళ్లు నా ఆశయాలతో పనిచేశాను. బలమైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేయలేక కాదు.. చేతకాక అంతకన్నా కాదు. ఈసారి వేసి చూపిస్తా. చాలా బలమైన రాజకీయాలు చేస్తా. రాజకీయం అంటే ఏంటో చూపిస్తా’ఇవి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. మంచితనం వదిలితే తప్ప మనుగడ సాధ్యం కాదన్నట్లు... పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా మారిపోయాడు. తన ఆశయాల్ని, మంచితనాన్ని నెమ్మది నెమ్మదిగా పక్కన పెడుతున్నాడు. ఏపీలో కుల మత రాజకీయాలకు నెమ్మ నెమ్మదిగా పదునెక్కిస్తున్నాడు. ఇందుకు పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం. జగన్ క్రిస్టియానిటీ మీద, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం మీద పవన్ గత కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. హిందుత్వ నాయకులే సెక్యులరిజాన్ని దెబ్బతీస్తున్నాడన్నారు. ఇలా పవన్ చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన కూడా రూటు మారుస్తున్నాడని అర్థం అవుతోంది.
తాజాగా జనసేన నుంచి బయటకు వచ్చిన రాజు రవితేజ చెప్పిన మాటలు కూడా ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా కుల, మతాలపై ఆసక్తి లేదు కానీ... వాటిని రాజకీయంగా వాడుతున్నాడని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే... జనసేనాని ఓ నిర్ణయానికి వచ్చాడన్న విషయం స్పష్టమయ్యింది. మరోవైపు ఈ కులమత రాజకీయాలే ఆధారంగానే.. పవన్ కల్యాణ్... 2024 ఎన్నికలకు పదునైన వ్యూహం కూడా రచిస్తున్నారని సమాచారం. అందుకే ఉభయగోదావరి జిల్లాల నుంచే పవన్ తన కొత్త రాజకీయాలు ప్రారంభించాడు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా రాజు, బ్రహ్మణులకే పట్టు ఉంది. ఇక కమ్మ, కాపు కులాలు ఎలాగో కొన్ని పార్టీలకే మద్దతిస్తున్నాయి. మరోవైపు ఎస్టీ, ఎస్సీ కులాలు జగన్ వైపునకు జరిగిపోయాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం వచ్చి జనసేనకు మద్దతిచ్చినా... బడుగు బలహీన వర్గాలు మాత్రం మాత్రం జగన్‌కే ఓటేశారు. దీంతో నిజాయితీగా రాజకీయాలు చేసిన ప్రయోజనం లేదని భావించిన పవన్... అసలు రాజకీయాల్ని ప్రారంభించారు. పవన్ కుల రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన ఏపీలో పక్కాగా తన ప్లాన్‌ను అమలు చేసే పనిలో పడ్డాడు. అందుకే ఇక గోదావరి జిల్లాల్లో మిగిలిన అగ్రకులాలైన రాజు, బ్రహ్మాణుల్ని తన వైపునకు తిప్పుకొనే పనిలో పడ్డారు.
ఇక పవన్ దగ్గర మరో దారి లేదు. ఇటు జనసేనకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యూ సైతం వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఇక పార్టీని బతికించాలంటే... అలాంటి రాజకీయం చేయడం తప్పనిసరి. పవన్ కొత్తరాజకీయాలు పార్టీ అత్యవసర మనుగడకేనని రాజు రవితేజ మాట్లలోనే వ్యక్తమవుతోంది. ‘పరిస్థితులకు తగ్గట్టు మారకపోతే జీవి మనుగడ సాధ్యం కాదు’ అని చార్లెస్ డార్విన్ చెప్పాడు. మరి పవన్ కొత్తగా వెళ్తున్న ఈ దారిలో మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Janasena mla varaprasad, Janasena party, Pawan kalyan