సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా వెలగతోడులో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైసీపీపై నిప్పులు చెరిగారు. రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతుంటే ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో తింటున్నారని విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు రైతు రక్తంతో తడిసిన మద్దను తింటున్నారని అన్నారు. ఓట్ల కోసం జగన్ రోడ్లు పట్టుకొని తిరిగారని, పాదయాత్రలో రైతులకు అండగా ఉంటామని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆకాశంలో ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని అన్నారు. సీఎం జగన్ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. కొందరు పవన్ సభలకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదేమి తీరని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏ ప్రభుత్వమైనా సరే.. రైతు కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని హెచ్చరించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులకు అండగా తాను ఉంటానని, న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Janasena party, Pawan kalyan