కోనసీమ జిల్లా (Konaseema District) విషయంలో అమలాపురం (Amalapuram)లో జరిగిన హింసపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ (YSRCP) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. తాను కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతానని ప్రకటించినప్పుడు ఆ జిల్లాకు చెందిన కొందరు.. వద్దని చెప్పినట్లు పవన్ వెల్లడించారు. కోనసీమ విషయంలో ప్రభుత్వమే అల్లర్లకు కారణమైందన్నారు. అంబేద్కర్ ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారే తప్ప.. ఆయన స్ఫూర్తిని కొనసాగించడం లేదన్నారు. వైసీపీ వారికి అంబేద్కర్ పై నిజంగా ప్రేమ, భక్తి ఉంటే.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సవ్యంగా వినియోగించుకోవాలన్నారు.
అమలాపురం గొడవల వెనుక జనసేన, ఇతర పార్టీలున్నాయన్న ఆరోపణలకు తానేమీ ఆశ్చర్యపోవడం లేదని పవన్ అన్నారు. వైసీపీ వాళ్లు ఏనాడు తమ తప్పులను ఒప్పుకోలేదని విమర్శించారు. దేశంలో ఎస్సీలపై దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు.
ఎస్సీల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పక్కదారి పెట్టించడానికే వారి మంత్రులపై వారే దాడి చేయించుకున్నారని పవన్ ఆరోపించారు. అప్పటికే జిల్లాలో 144 సెక్షన్ విధించినప్పుడు.. పోలీసులను ఎందుకు మోహరించలేదని పవన్ ప్రశ్నించారు. కోడికత్తి కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో హో మంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసును గుండెపోటు నుంచి గొడ్డలివరకు తెచ్చారన్నారు. కోడికత్తి కేసులో ఏపీ పోలీసులను నమ్మమన్న సీఎం.. ఇప్పుడెందుకు కేసును వదిలేశారన్నారు. మీమీదే దాడులు చేయించుకొని సానుభూతి కోసం యత్నిస్తున్న మీరు.. మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
వ్యక్తులు, కులాలు కొట్టుకున్నంత కాలం రాష్ట్ర అభివృద్ధి చెందదన్నారు పవన్ కల్యాణ్. తుని ఘటనతో రైలు తగలబెట్టి వేరే వాళ్లపై తోసేశారన్నారు. ఇప్పుడు మీ మంత్రి, ఎమ్మెల్యేపై మీరే దాడి చేయించుకొని ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నారని పవన్ ఆరోపించారు. యువత కూడా లాంటి విభజన రాజకీయాలు చేసే నాయకులకు దూరంగా ఉండాలని.. ఎలాంటి భావోద్వేగాలకు గురికావొద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాల్లో వైసీపీ మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారికి సజ్జల లాంటి వ్యక్తులు మంచి చెడులు చెప్పాలన్నారు.
అంబేద్కర్ జిల్లా పేరు విషయంలో కోనసీమ జిల్లా వాసులు తమ నిర్ణయం వారు తీసుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అందరూ ఉమ్మడిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలించకుండా ఉండాలని పవన్ సూచించారు. రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులకు పోలీసులు వత్తాసు పలికితే ఆ నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు. అమలాపురంలో జరిగిన గొడవ.. కులాల మధ్య జరిగినది కాదని.., అంబేద్కర్ వంటి మేథావిని ఓ జిల్లాకు పరిమితం చేయడం సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.