GT Hemanth Kumar, News18, Tirupati
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరోసారి కులరాజకీయం అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ (YSRCP) ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) పై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కుల రాజకీయాలకు ఆజ్యం పోశాయి. ఏపీలో కురుబ వర్సెస్ కమ్మ రాజకీయ చదవరంగాల అట హాట్ హాట్ గా సాగుతోంది. ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు కమ్మ సామజిక వర్గం భగ్గుమంటుంటే..! అందుకు వ్యతిరేకంగా కురుబలు నిరసనలు తెలుపుతున్నారు. ఓ వైపు రాయలసీమలో అంటుకున్న కుల ద్వేషాలు రాష్ట్ర వ్యాప్తంగా పాకేస్తోంది. ఒక్క వివాదం మరో కొత్త టర్న్ తీసుకుంది. రెండు కులాల మధ్య చిచ్చు రేపింది.ఒకరు తగ్గేదే లే అంటుంటే... మరొకరు దేనికైనా రెడీ అంటున్నారు. అనంతపురంలో చంద్రబాబు, లోకేష్ బ్యానర్లతో కమ్మవర్గానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు కురబలు.
ఈ విషయంలో కమ్మసామాజిక వర్గం కూడా ఘాటుగా స్పందించింది. తమ కులాన్ని గోరంట్ల కించపరిచారని విమర్శిస్తూ కమ్మవర్గం కదిరిలో ర్యాలీతో కదం తొక్కింది. అంతేకాదు అనంతపురంలో గోరంట్ల ఇంటిని ముట్టడిస్తామన్న హెచ్చరికలతో ప్రకంపనలు సృష్టించారు కమ్మ సామాజికవర్గం నేతలు. దీంతో గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు గోరంట్లకు మాధవ్ కు అండగా ఆయనింటి వద్ద అనుచరులు పహారా కాస్తున్నారు. మాధవ్ చేసిన వ్యాఖ్యలు కేవలం కొందరు దుష్ట నేతలను దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యలు చేశారని కురుబ కులస్థులు చెప్తున్నరు.
కేవలం ఇద్దరు ముగ్గురి పేర్లు చెప్పినంత మాత్రాన కమ్మవాళ్లందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు కుల రాజకీయం చేస్తుందని ఆరోపించారు కురుబ కుల నేతలు. కురుబ సామాజిక వర్గం నేతలను చట్టసభల్లోకి రానివ్వకుండా కుట్ర చేస్తున్నారని వారు ఆక్రోశం వ్యక్త పరిచారు. ఒక్క గోరంట్లను ఆపితే అంతా ఆగిపోతుందన్నదే వాళ్ల కుట్రని చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న కమ్మ సామాజికవర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంపీ మాధవ్ కు వ్యతిరేకంగా కమ్మకుల సంఘాల నేతలు రోడ్లపై నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు 24 గంటల్లోపు వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలన. డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గోరంట్ల మాధవ్ ను అనంతపురంలోకి రానివ్వబోమని హెచ్చరించారు కమ్మ నేతలు. బెజవాడలో ప్రెస్ మీట్ పెట్టిమరీ గోరంట్లను హెచ్చరించారు కమ్మ సంఘం నేతలు. వ్యక్తులు- వ్యక్తులకి మధ్య ఇష్యూ ఉంటే సామాజిక వర్గాలను లాగటం ఏమిటని ప్రశ్నించారు. ఎంతోమందికి సామాజిక సేవ చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే కమ్మ వాళ్లను ఇతర కులాలకు దూరం చేసే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో తమకు 300కు పైగా సంఘాలు ఉన్నాయని, కమ్మ యువత రగిలిపోతోందని చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోరంట్ల ఇల్లు దాటి బైటికి రాలేదని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics