Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని అంశం (AP Capital Issue) ఎవర్ని ఎటు తీసుకుపోతుందో అర్ధంకావడం లేదు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ పేరుతో వైసీపీ (YSRCP), ఒకే రాజధాని అంటూ టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP), ఇతర పార్టీలు నినాదాలు చేస్తున్నాయి. రాజధాని విషయంలో ఎవరి వాదనలు వారికి సరైనవే అనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనానంతరం రాజధాని హైదరాబాద్ (Hyderabad) తెలంగాణకు చెందడంతో విభజిత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి.. నిర్మాణాలు ప్రారంభించింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా అమరావతికి ఓటేశారు. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అమరావతి ఓ పెద్ద స్కామ్ అని.. ఇక్కడ గ్రాఫిక్స్ తప్ప రాజధాని లేదని.. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందంటూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
అధికార వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా ఆ దిశగా ఏమీ చేయలేని పరిస్థితి. పైగా కోర్టు తీర్పులు, ఆర్ధిక ఇబ్బందులు, రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు కూడా మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి.
ఇంకొ ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజధానుల అంశంలో ప్రభుత్వ వైఫల్యం కప్పి పుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమే మొన్నటి "విశాఖ గర్జన" అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రతిపక్షాలు ఉద్యమాలు, గర్జలు చేస్తాయి తప్ప అధికార పక్షం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టం చాలా అరుదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను భుజలాకెత్తుకుంది. ఐతే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతి ఆగిపోవడమే కాకుండా.. మూడు రాజధానుల అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని మాత్రం వాస్తవం. కోర్టు కేసులు, రైతుల పాదయాత్రలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో గర్జనల పేరుతో ప్రజలను వంచిస్తూ ప్రభుత్వం మభ్యపెడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇదే సమయంలో సీఎం జగన్.. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదాలనే చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనే పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి నవనిర్మాణ దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీల్లో వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ దీక్షలతో పార్టీకి, ప్రభుత్వానికి వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. దీంతో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎలాంటి ఫలితాన్ని కట్టబెట్టారో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న స్టెప్.. చంద్రబాబు దీక్షల మాదిరిగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు గర్జనల పేరుతో ముందుకెళ్తే.. మొదటికే మోసం వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలే తప్ప.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే రివర్స్ అయ్యే ప్రమాదముందని సలహా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu