AP Welfare schemes: గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) కార్యక్రమాన్ని వైసీపీ అధినేత చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే పార్టీ నేతలకు పదే పదే అదే మాట చెబుతున్నారు. ఎవరైతే గడప గడపకు కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నారో.. వారికి క్లాస్ పీకుతున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారానే ప్రజా ప్రతినిధులు తమ గ్రాఫ్ పెంచుకోవాలని కోరుతున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా ఈ గడప గడపకు కార్యక్రమాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు. కొందరు మాత్రం.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెనుతిరుగుతున్నారు. కొందరు సమాధానం దాటవేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే విమర్శలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియడం లేదని కొందరు నేతలు ఈ కార్యక్రమాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అలాంటి వారి జాబితా దాదాపు 20కి పైగానే ఉంది. ఇటీవల వారందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) క్లాస్ పీకారు.. దీంతో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అయితే ఇందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన సమయంలో వర్ల రామయ్య తన నివాసంలోనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం బయటకు రాలేదు. తమ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కింద వర్ల రామయ్య సతీమణికి 13,500 సాయం అందిందని వెల్లంపల్లి లేఖ అందించే ప్రయత్నం చేశారు. అయితే వర్య రామయ్య కానీ.. ఆయన భార్య కానీ బయటకు రాలేదు.. వారి కారు డ్రైవర్ వచ్చి ఆ పాంప్లెట్ అందుకున్నారు.
ఇదీ చదవండి : భూతల స్వర్గంలా ఆకట్టుకుంటున్న కొత్త పర్యాటక ప్రాంతం.. చేతులను ముద్దాడేలా మేఘాలు
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీడీపీ నేత వర్ల రామయ్య నిత్యం తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని.. అయినా ఆయన ఇంట్లోనూ రైతు భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. వర్ల రామయ్య కూడా ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్దిదారుడేనని పేర్కొన్నారు. ఆయనే కాదు.. నిజంగా అర్హత ఉంటే చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పేదలు, సామాన్యులకు మరో శుభవార్త చెప్పిన సీఎం.. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో కీలక నిర్ణయాలు
పథకాలు అందించే విషయంలో తాము ఏ పార్టీ అని చూడటం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని.. ఇదే తమ ప్రభుత్వ గొప్పతనం అని అభిప్రాయపడ్డారు. వివక్షకు తావు లేకుండా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes, Varla ramaiah