హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

యూ టర్న్ కాదు రైట్ టర్న్, జగన్ ట్రాప్‌లో మోదీ : చంద్రబాబు

యూ టర్న్ కాదు రైట్ టర్న్, జగన్ ట్రాప్‌లో మోదీ : చంద్రబాబు

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

కొవ్వూరులో నిర్వహించిన నగర దర్శిని సభలో సీఎం చంద్రబాబునాయుడు.. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్‌పై నిప్పులు చెరిగారు.

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కొవ్వూరులో నగర దర్శిని బహిరంగ సభలో మాట్లాడిన ఏపీ సీఎం.. పార్లమెంట్‌లో అవిశ్వాసం సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను యూ టర్న్ తీసుకోలేదని.. రైట్ తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ సీఎంను పొగుడుకుంటే నష్టం లేదంటూనే.. తనకు ప్రజల సర్టిఫికెట్ చాలంటూ కౌంటర్ ఇచ్చారు.

నేను కాదు. మీరు వైసీపీ ట్రాప్‌లో పడ్డారు. అవినీతి కుడితిలో పడ్డారు. మీకు వ్యామోహం. మీకు సహకారం కావాలి. మీరు ఒక్క సీటు కూడా గెలవరు. ఒక్క ఓటు కూడా రాదు. టీడీపీ సహకరించకపోతే వైసీపీని పట్టుకుంటే ఒకటో రెండో సీట్లు వస్తాయని కక్కుర్తి పడ్డారు. తెలంగాణ సీఎంతో పోలుస్తూ.. నాకు మెచ్యూరిటీ లేదంటారా? నేను మీ కంటే ముందే ముఖ్యమంత్రినయ్యా. తెలంగాణ ముఖ్యమంత్రి నా సహచరుడు. ఆయన్ను పొగుడుకుంటే నాకు నష్టం లేదు. అయినా మీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. ప్రజల సర్టిఫికెట్ కావాలి. నేను యూ టర్న్ తీసుకోలా. రైట్ టర్న్ తీసుకున్నా. మీరు యూ టర్న్ తీసుకున్నారు. మీరు కుట్రలు పన్నారు. మీరు కుతంత్రాలు చేశారు.

చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి

అదే సమయంలో జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబునాయుడు.

డబ్బుల కోసం పోలవరానికి వస్తున్నాని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు మనుషులా? రాక్షసులా? మనిషి జీవితమేనా? నేను నిన్ను ఫాలో అవ్వాలా? నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నీకు రాజకీయ ఓనమాలు తెలీవు. నిన్ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఆ పరిస్థితి రాష్ట్రానికి రానివ్వను. అవిశ్వాసం సందర్భంగా ఎక్కడున్నారు? లాలూచీ పడి రాజీనామా చేసి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు. రాజీనామా ఎందుకు చేయాలి? ప్రతి రోజూ ఢిల్లీలో ఉండి గజగజలాడిస్తాం. దేశంలో అందర్నీ కలుపుతాం. పార్లమెంట్ లో పోరాడి.. సాధిస్తామే కానీ, వెన్ను చూపే ప్రసక్తే లేదు.

చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి

ఐదు కోట్ల మంది ప్రజలంటే లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ టైమ్‌లో కూడా కొందరు కుట్రదారులు ఉద్యమాన్ని నీరు గార్చారని.. ఇప్పుడు కూడా వైసీపీ అదే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ సీట్లు గెలిపించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎవరైతే రాష్ట్రానికి న్యాయం చేస్తారో వారికే మద్దతిస్తామన్నారు.

First published:

Tags: AP Special Status, Bjp-tdp, Chandrababu naidu, Janasena party, Narendra modi, Ys jagan

ఉత్తమ కథలు