AP POLITICS HERE ARE THE SENSATIONAL FACTS BEHIND THEFT OF KEY DOCUMENTS IN NELLORE COURT PRN
AP Politics: కోర్టులో దొంగతనం.. ఏపీలో పొలిటికల్ హీట్.. ఆ మంత్రిపై టీడీపీ సంచలన ఆరోపణలు
ప్రతీకాత్మకచిత్రం
నెల్లూరు (Nellore) కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన దొంగతనం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇందులో ఏపీ మంత్రి కేసుకు సంబంధించిన పత్రాలుండటం కలకలం సృష్టిస్తోంది.
నెల్లూరు (Nellore) కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన దొంగతనం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం చోరీకి గురైన బ్యాగులో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Gowardhan Reddy) , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) మధ్య నడుస్తున్న కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహరంపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ పై టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పరువు నష్టం కేసులో మంత్రి కాకాణికి శిక్ష పడుతుందన్న భయంతోనే కోర్టులో దొంగతనం చేయించారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాణిపై ఉన్న కేసును ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు చెప్పినా.. ప్రజాప్రతినిథుల కోర్టు అంగీకరించలేదని. ఈ కేసులో జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతో మంత్రే ఇదంతా చేయించారని సోమిరెడ్డి అన్నారు.
దీనిపై అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా స్పందించారు. కోర్టులో కేసుకు సంబంధించిన పత్రాల చోరీ జరగడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. కాకాణికి సంబంధించిన పత్రాలు ఎత్తుకెళ్లి మిగిలిన డాక్యుమెంట్స్ వదిలేయడం వెనుక కుట్రదాగి ఉందని కేశవ్ ఆరోపించారు. కేసులో నిందితుల బెయిల్ రద్దు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది..?
నెల్లూరు కోర్టు కాంప్లెక్స్ లోని 4వ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. తర్వాతి రోజు కోర్టుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి చిన్నబజారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిథి కేసులోని కీలకపత్రాలు, స్టాంపులు, ఎలక్ట్రానిక్ వస్తువులున్న బ్యాగ్ కనిపించకుండాపోయింది. ఐతే ఆ బ్యాగ్ కోర్టుబయట ఉన్న కాలువలో కనిపించగా దానిని చెక్ చేసిన పోలీసులకు ఏమీ దొరకలేదు. ఐతే కోర్టులో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు.
ఏంటా కేసు..?
2017లో అప్పటి మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హవాలాకు పాల్పడ్డారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొన్ని పత్రాలు చూపించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో సోమిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. దీనిపై నెల్లూరు ఫోర్త్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఐతే కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పిటిషన్ వేసినా.. ప్రజాప్రతినిథుల కేసులు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేయడంతో విచారణ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.