Godavari Floods: పశ్చిమ తీర ప్రాంతాలతోపాటు, సెంట్రల్ ఇండియాలో వారం రోజులుగా కురుస్తున్న వానలు.. మరో ఐదు రోజులపాటు దంచికొట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh), విదర్భ (Vidarbha), మధ్య ప్రదేశ్ (Madhya Pradesh), ఒడిశా (Odisha), మహారాష్ట్ర (Maharashtra), గుజరాత్ (Gujarat), కేరళ (Kerala), ఏపీ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ సూచించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తునప్పటికీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలాఉన్నాప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా నదుల్లో వరద ప్రవాహం భారీగా చేరుతోంది. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో (Godavari) భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా బంగాళాఖాతం వైపు పరుగులు పెడుతోంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం (Polavaram) ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను నిర్మించామని అధికారులు చెబుతున్నారు. అయితే భయం వీడడం లేదు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయక తప్పదంటున్నారు.
మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి. మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.
అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి.ఇలా గోదారికి వరదలు రావడం 100 ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచారు. అయితే గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు,వాటిని ఎత్తడానికి అవసరమైన 84హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు.ఇదేవిధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు.
ఇదీ చదవండి : కటీఫ్ కు వేళాయే..! బీజేపీతో జనసేన బంధం తెంచుకోనుందా..? ముహూర్తం ఫిక్స్..!
పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48 రేడియల్ గేట్ల కారణంగా.. దాదాపు 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా 100ఏళ్ళ చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. వందేళ్ళలో గోదావరికి 36లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశామంటున్నారు.
ఇదీ చదవండి : అదివో అల్లదివో.. ఆధ్యాత్మిక ప్రాంతం.. మరింత ఆహ్లాదకరంగా మారిన దృశ్యం.. మీరూ చూడండి
భద్రాచలంలో అత్యధికంగా గోదావరి వరద నీటిమట్టం నమోదైన సంవత్సరాలు ఇలా వున్నాయి.
1976- 63.9 అడుగులు
1983- 63.5 అడుగులు
1986-75.6 అడుగులు
1990- 70.8 అడుగులు
1994- 58.6 అడుగులు
1995- 57.6 అడుగులు
2006- 66.9అడుగులు
2010 – 59.7అడుగులు
2013- 61.6 అడుగులు
2014- 56.1 అడుగులు
2022-61.6 అడుగులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, AP News, Godavari, Heavy Rains