ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార పార్టీ వైసీపీ (YSRCP) లో వర్గవిభేదాలు భగ్గముంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీకి మద్దతు పలికిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi), వైసీపీ నేత దుట్టా రామచంద్రరరావు వర్గాల మధ్య వైరం నడుస్తోంది. దాదాపు రెండేళ్లుగా రగులుతున్న పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో గన్నవరంపై దృష్టిపెట్టిన సీఎం జగన్.., సజ్జల ద్వారా ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించారు. గురువారం ఎమ్మెల్యే వంశీతో పాటు వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఇద్దరితోను సజ్జల చర్చించారు.
సజ్జలతో భేటీ అనంతరం వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సజ్జలతో చర్చించామని.., వైసీపీ పాత కేడర్ ను ఎమ్మెల్యే వంశీ కలుపుకుపోవడం లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. వైసీపీలో ఉండే నిఖార్సయిన కార్యక్ర్తలను ఎమ్మెల్యే వంశీ తొక్కేస్తున్నారని దుట్టా రామచంద్రరావు ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామన్న సంగతి చెప్పామని.. కలిసి పనిచేసే పరిస్థితుండదని స్పష్టం చేశామన్నారు.
50 ఏళ్లుగా తాము వైఎస్ రాజశేఖర రెడ్డితో నడిచామని.,. కాంగ్రెస్ కు రాజీనామా చేసి 12 ఏళ్లుగా జగన్ తో నడుస్తున్నమన్నారు. తామెప్పుడూ పదవులు ఆశించలేదని.., ఎమ్మెల్యే వంశీని పార్టీలోకి తీసుకున్నప్పుడు నిర్ణయాన్ని గౌరవించాలని అప్పట్లో పెద్దిరెడ్డి చెప్పారని.., కానీ తొలి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను వంశీ తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని దుట్టా విమర్శించారు.
పదేళ్లుగా జెండా మోసిన వైసీపీ వారిని ఎమ్మెల్యే వంశీ పక్కన పెట్టారని., టీడీపీ నుంచి తనతోపాటు వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నాని.. ఆయనతో ఇమడలేక రెండేళ్లుగా పక్కనే ఉన్నామన్నారు. వంశీ కారణంగా తన ఆత్మగౌరవం దెబ్బతిందని.., ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత తిరిగి కలిసే పరిస్థితి లేదన్నారు దుట్టా.
వైఎస్ కుటుంబం కోసం ఉడతా భక్తిగా ఏం చేసేందుకైనా తాను సిద్ధణని.. కానీ అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవమానాలు భరిస్తూ వేరొకరి వెనక తిరగాల్సిన పరిస్థితి ఉందని.. ఇన్ ఛార్జ్ గా వంశీని మార్చాలని అధిష్టానాన్ని కోరినట్లు దుట్టా తెలిపారు. ఇకపై ఎమ్మెల్యే వంశీతో కలసి పనిచేయలేమని అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. మరోసారి పిలుస్తామని సజ్జల చెప్పారని.. ఏం జరుగుతుందో చూద్దామని దుట్టా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gannavaram, Vallabaneni Vamsi, Ysrcp