AP POLITICS HALF DAY SCHOOLS START FROM APRIL 4TH IN ANDHRA PRADESH BECAUSE OF MORE TEMPERATURE NGS
Half day Schools: ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే
ఏపీలో 4 నుంచి ఒంటిపూట బడులు
Half day Schools: ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు.. రోడ్డు ఎక్కాలంటే భయపడాల్సి వస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల 40కి పైగా టెంపరేచర్ మాడు పగిలేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Half day Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యుడి ప్రతాపంతో జనం విల విలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే రోడ్డు ఎక్కాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. భానుడి భగభగల ధాటికి తట్టుకోలేక పెద్దవారే బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిన్న పిల్లలను ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలల్లో (Schools) కూర్చోబెడుతుండడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం రోజే.. కొత్త జిల్లాల పరిపాలన కూడా ప్రారంభం కానుంది.
అయితే ఇప్పటికే ఆలస్యం అవ్వడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ (Telangana)లో ఎండలు మండిపోతున్నాయని మార్చి 15 నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు రాబోయే వారం రోజులు.. అంటే ఏప్రిల్ 6 వరకు వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే బడులను నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ ఏపీలో మాత్రం ఇంత ఆలస్యం చేయడంపై ఇప్పటికే తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ నమోదవుతున్నా సరే ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం కనిపించలేదు. ఉదయం పది గంటలకే భానుడి భగభగల ధాటికి తట్టుకోలేక పెద్దవారే బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్న తరుణంలో చిన్న పిల్లలను ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలల్లో కూర్చోబెడుతుండడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బడికి రాబోమని చెప్పలేక…తప్పనిసరి పరిస్థితుల్లో హాజరవుతూ విద్యార్థులు, చిన్న పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం ఎట్టకేలకు దీనిపై నిర్ణయం తీసకుంది.
మామూలుగా అయితే, ప్రతి ఏటా మార్చి15 నుంచి ఒంటిపూట బడులు పెట్టడం ఆనవాయితీ. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను బట్టి దశాబ్దాల నుంచి ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే, కరోనా కాలంలో క్లాసులు మిస్సయ్యాయని, కాబట్టి ఈసారి కొంచెం లేటుగా ఒంటిపూట బడులు పెడతారని కొందరు అధికారులు చెప్పారు.. కానీ ఎండల తీవ్రత భారీగా పెరగడంతో.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.