ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితలు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రత్యేక్ష యుద్ధమే సాగుతోంది. చాలా చోట్ల వైసీపీ-టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగుతున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఐతే గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రిగ్గింగు పాల్పడ్డారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందనలో బ్యాలెట్ పేపర్లపై ముందుగానే ఫ్యాన్ గుర్తుపై ఓటు ముద్ర కనిపించడం కలకలం రేపింది. బ్యాలెట్ పేపర్ల బండిల్ మొత్తం ఫ్యాన్ గుర్తుపై ముద్ర ఉండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాటతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సిబ్బంది అధికార పార్టీకి సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యవహారంపై స్థానిక వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సాకుర్రుగున్నెపల్లెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లపై జనసేన గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థితో పాటు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పోలింగ్ కేంద్రంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ పై గుర్తు మిస్ అవడంపై పోలింగ్ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోయారు. పొరబాటున ఇలా జరిగి ఉంటుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. మరోవైపు జనసేన మాత్రం అధికార పార్టీ కుట్రతోనే జనసేన గుర్తు లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్తి డిమాండ్ చేశారు. ఐతే ఆందోళన నేపథ్యంలో స్పందించిన ఎన్నికల అధికారులు పోలైన ఓట్లను క్యాన్సిల్ చేసి కొత్త బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ కేంద్రాల్లో యువకులు చేసిన పనికి అంతా షాక్.. రూల్స్ తెలియవా..?
మరోవైపు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడులోనూ టెన్షన్ వాతావరణం నెలసొంది. పోలింగ్ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపు చేశారు. దాదాపు గంటపాటు గ్రామమంతా రణరంగంగా మారడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నా.. పోలింగ్ రోజున మాత్రం రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనడం టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.