Garbage tax: ఆంధ్రప్రదేశ్ చెత్తపనున్నపై దుమారం ఆగడం లేదు. ఓ వైపు మంత్రులు.. అధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఎవరి దగ్గరా బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడం లేదని.. ఇష్ట పూర్వకంగా.. ప్రజలు పన్ను కడుతున్నారని చెబుతున్నారు. కానీ తాజాగా విజయనగరం జిల్లాలో నగర పాలక సంస్థ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. పన్ను కట్టలేదని బయట డస్ట్‌బిన్‌లో వేసిన చెత్తను శానిటేషన్ సిబ్బంది ఓ అపార్ట్‌మెంట్ దగ్గర వేశారు. అదే సమయంలో అక్కడ ఉన్నఅపార్ట్‌మెంట్ అసోసియేషన్ కార్యదర్శి యుఎస్ రవికుమార్‌తో శానిటేషన్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదేంపని అని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కనీసం అపార్ట్ మెంట్ బయట అయినా వేయండి.. ఇలా లోపల తెచ్చి వేయడం ఏంటని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మరో మహిళ కూడా అపార్ట్ మెంట్ లోపల చెత్త వేయకండి అని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.. వారు వద్దని వారిస్తూ.. వారి ఎదురుగానే చెత్తను తెచ్చి అపార్ట్ మెంట్ లో వేశారు.
దీనిపై రవికుమార్ వాదనకు దిగడంతో.. సచివాలయ ఉద్యోగి మణికంఠ కూడా అదే స్థాయిలో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఆ ఫొటోలు తీస్తున్న రవికుమార్ మొబైల్‌ను మణికంఠ అనే సచివాలయ ఉద్యోగి నేలకేసి కొట్టాడు. ఫోన్ ఎందుకు విసిరికొడతారని ప్రశ్నిస్తే..? వెంటనే పన్ను కట్టండి లేదంటే రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
విజయనగరంలో చెత్తపన్ను కట్టలేదని గేటు ముందు చెత్త వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం! pic.twitter.com/HrU14sdL48
— iTDP Official (@iTDP_Official) August 24, 2022
పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. చెత్త పన్ను చెల్లించకపోతే ప్రజలపై భౌతిక దాడులు చేస్తారా? అంటూ నిలదీశారు. పిపిఎస్‌ఎస్ నాయకులు టివి రమణ మాట్లాడుతూ చెత్త పన్ను కట్టలేదని ఇంట్లో చెత్త వేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి విషాయలపై కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ లేని విధంగా ఏపీలో ప్రజలనుండి చెత్త పన్ను వసూళ్లు చేస్తుంది వైస్సార్సీపీ సర్కార్ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన విజయనగరంలో కలలకం రేపింది. దీనిపై మునిసిపల్ అధికారులను వివరణ కోరగా..? సదరు నివాసదారులు నవంబరు నుంచి పన్ను కట్టడం లేదని, కావాలనే రహదారులపై చెత్త వేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్య సిబ్బంది అదే చెత్తను తీసుకెళ్లి అపార్ట్‌మెంట్ ముందు వేశారన్నారు. ఇదీ చదవండి : రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు.. కుప్పం వేదికగా సంచలన ప్రకటన
అయితే ఎవరి వివరణ ఎలా ఉన్నా..? ఏపీలో చెత్త పన్ను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. గతంలో చెత్త పన్ను వసూలు మొదలెట్టినప్పుడు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో పన్ను కట్టలేదని ఓ దుకాణం ముందు సిబ్బంది చెత్త పారబోశారు. అప్పట్లో దీనిని పన్ను వసూలు కోసం చేపట్టిన వినూత్న చర్యగా సమర్ధించుకున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే విజయనగరంలో చోటుచేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Taxes, Vizianagaram