AP POLITICS GANNAVARAM MLA VALLABHANENI VAMSI WILL MEET CM JAGAN MOHAN REDDY TOMORROW NGS GNT
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఫ్యూచర్ పై క్లారిటీ వస్తుందా.. నేడు సీఎం దగ్గర గన్నవరం పంచాయితీ
వల్లభనేని సైలెన్స్ కు కారణం అదేనా?
Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ప్రస్తుతం గన్నవరం పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ముఖ్యంగా వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని.. వ్యతిరేక వర్గం చెబుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే వంశీ పొలిటికల్ కెరీర్ కు బ్రేక్ లు పడే ప్రమాదం ఉంది. దీంతో ఆయన భవిష్యత్తుపై సీఎం జగన్ ఎలాంటి భరోసా ఇస్తారో అన్నది నేటి భేటీలో తేలనుంది.
Vallabhaneni Vamsi: ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ హాట్ టాపిక్ అవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ టీడీపీ తరపున నెగ్గి తన బలం నిరూపించుకున్నారు. కానీ తరువాత జరిగిన పరిణామాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ (Vallabaneni Vamsi) ఒక్కసారి తన రూటు మార్చారు. టీడీపీ (TDP) నుంచి గెలిచి.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లపై తీవ్ర విమర్శలు చేశారు. జై సీఎం జగన్ (CM Jagan) అంటూ.. వైసీపీ (YCP) గూటికి చేరారు.. అయితే ఆయన టీడీపీకి దూరం కావడానికి ప్రధాన కారణం.. వైసీపీలో ఉన్న అప్పటి మంత్రి కొడాలితో ఉన్న సాన్నిహిత్యం.. దానికి తోడు నారా లోకేష్ తో ఉన్న గ్యాప్.. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ వేరే వారికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉండడంతోనే.. ఆయన సైకిల్ దిగారనే ప్రచారం ఉంది. ఇక తాను టీడీపీ నుంచి వైసీపీకి వస్తే బ్రహ్మరథం పడతారు అనుకొని ఉండొచ్చు.. ఎందుకంటే అప్పటికే ఆయనకు సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దానికితో డు.. తనకు అత్యంత అప్తుడు కొడాలి నాని మంత్రిగా ఉండడం.. అందులోనూ సీఎం దగ్గర ఏదైనా మాట్లాడేంత స్వేచ్ఛ ఉన్నవారిలో కొడాలి నాని ఒక్కరు.
ఇలా లెక్కలు వేసుకుని వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఊహించారు.. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అవుతోంది. వల్లభనేని వ్యతిరేకులంతా.. కూడబల్లుకుని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కి లేఖలు రాశారు.. గన్నవరంలో వంశీకి సీటు ఇస్తే ఓడిస్తామని.. కాదని ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటా అంటూ ఘాటుగా లేఖలు రాశారు. ఇక గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలోనూ ఆయన ఫ్లెక్సీలు కనిపించనీయకుండా చేశాయి ప్రత్యర్థి వర్గాలు.
ఇటు వంశీ అనుచరులు సైతం.. ప్రత్యర్థి వర్గాన్ని పక్కన పెట్టి.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలు మరింత హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్ కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో ఆ ఇద్దరి వ్యవహారం త్వరగా తేల్చాయాలని సీఎం జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరి పంచాయతీ వివాదంపై పరిష్కరించేందుకు మొదట బుధవారం సాయంత్రం రావాలని ఆదేశించినా… సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా.. గురువారం సాయంత్రం 6గంటలకు తాడేపల్లికి రావాలని సీఎంవో సూచించింది.
సాధారణంగా గన్నవరం అంటే టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రాకపోవడంతో వల్లభనేని తన భవిష్యత్తు దృష్ట్యా అధికార పార్టీ వైసీపీలో జంప్ అయ్యారు. అయితే అప్పటి నుంచి అక్కడి వైసీపీ వర్గం పోరు ఊపందుకుంది. వంశీ తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ అసలైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి.
మరోవైపు గన్నవరం వైసీపీ ఇంఛార్జిని నియమించాలని వైసీపీ కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వల్లభనేని వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. అయితే సాధారణంగా ఇంఛార్జ్ కే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ పదవి తనకే ఇవ్వాలన్నది వంశీ ఆలోచన.. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.