రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో...? ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతారో చెప్పలేం. రాజకీయాల్లో వ్యక్తిగత అవసరాలతో పాటు రాజకీయ భవిష్యత్తుకు తగ్గట్లుగానే తమ నిర్ణయాలు మార్చుకుంటారు. అనుచరులు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే కొత్త ఆలోచనలు తీసుకుంటారు.అయితే ఇప్పుడు ఏపీలో ఓ కీలక నేత అధికార పార్టీని వీడి..ప్రతిపక్ష పార్టీలోకి మారుతున్నారు. తాజాగా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణగా మారాయి. వైసీపీ(YCP) స్థాపించిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు పార్టీని అంటిపెట్టుకున్న మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు(Prattipadu) నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత(Mekathoti Sucharitha)త్వరలోనే టీడీపీ(TDP)లో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చాలా రోజులుగా పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మేకతోటి సుచరిత పార్టీ అధినాయకత్వం నిర్ణయాలు నచ్చకపోవడం, తన భర్త టీడీపీలో కొనసాగాలనుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెప్పకనే చెప్పారని సోషల్ మీడియా(Social media)లో ఓ వీడియో సైతం వైరల్(Viral) అవుతోంది.
నా భర్త వెంటే నేను..
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకురాలు, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ..టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. పార్టీలో, జిల్లా రాజకీయాల్లో వివాదరహితురాలిగా ముద్రవేసుకున్న మాజీ హోంమంత్రి మూడ్రోజుల క్రితం తన నియోజకవర్గంలోని కాకుమానులో జరిగిన పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఆమె తన భర్త దయాసాగర్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మేకతోటి సుచరిత భర్త ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పని చేశారు. పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. తన భర్త పార్టీ మారతాను ..నువ్వు నాతో రా అంటే ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా భర్త నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు సుచరిత.
మేకతోటి సుచరిత మాటలకు అర్ధం ఏంటీ..
రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీని వీడే ప్రసక్తి లేదని గతంలో చెప్పిన మేకతోటి సుచరిత ఇప్పుడు షడన్‌గా పార్టీ మారాలన్న ఆలోచన ఆమెకుగా కలిగినది కాదంటున్నాయి జిల్లాకు చెందిన వైసీపీ వర్గాలు. ఎస్సీ సమాజిక వర్గానికి చెందిన మహిళను మంత్రి పదవి తొలగించడంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటి కారణాలతోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా ఆమె వర్గీయులు చెబుతున్నారు. అందుకే కాకుమానులో జరిగిన అంతర్గత సమావేశంలో తన మద్దతుదారులతో ముచ్చటించిన సమయంలో తన భర్త పార్టీ మారబోతున్నారనే వార్తను ఖండించకుండా తాను ఓ పార్టీలో ..తన భర్త మరో పార్టీలో పిల్లలు ఇంకో పార్టీలో కొనసాగడం మంచిది కాదని అందరం ఒకే పార్టీలో ఉంటామని సుచరిత చెప్పడం వెనుక పార్టీ మార్పు ఖాయమని తెలుస్తోంది. సోషల్ మీడియా గ్రూప్‌లలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న వీడియోపై వైసీపీ శ్రేణులు, ఆమె వర్గీయులు నమ్మలేకపోతున్నారు. మరి ఈ వార్తలు ఎప్పటికి నిజమవుతాయో...టీడీపీలో సుచరిత ఒక్కరే చేరుతారా లేక జిల్లాకు చెందిన వైసీపీ నేతల్ని ఎంకా ఎవర్నైనా తీసుకెళ్తారా అనే వార్తులు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, AP Politics, TDP, Ycp