ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) , టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు పార్టీలు బీజేపీ (BJP) దారిలోనే వెళ్తున్నాయని.. వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారే తప్ప.. బీజేపీని ఒక్కమాట కూడా అనరని ఆయన అన్నారు. ఏపీలో కులరాజకీయాలు తారాస్థాయిలో జరుగుతున్నాయన్నారు ఉండవల్లి. ఐతే ఎవరికైనా ఒకే కులపు ఓట్లతో విజయం సాధించడం సాధ్యంకాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తికాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్ణయాలను బట్టే పొత్తులు ఖరారవుతాయని.. ఏపీలో ఎవరు నెగ్గినా ఆ 25 మంది ఎంపీలు బీజేపీ ఖాతాలోనే చేరుతాయన్నారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నానని.., బిజెపి కాదంటే... పవన్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీకి అవకాశం లేదని., ద్విముఖ పోటీనే ఉంటుందన్నారు.
ఇక బీజేపీ అన్ని విషయాల్లో ఫెయిలై ఒక్క మతం విషయంలో మాత్రం సక్సెస్ అయిందని ఉండవల్లి విమర్శించారు. ఏపీ సీఎం జగన్ పంచె కడతారు.. పూజలు చేస్తారని.., విజయమ్మ కూడా పెద్దబొట్టుపెట్టుకొని భర్తకు హారతిపట్టేవారన్నారు. మళ్లీ మళ్లీ సభలో బైబిల్ పట్టుకుని ప్రార్ధనలు చేసేవారని ఆయన గుర్తుచేసారు. మన దేశంలో ఎవరు ఏదైనా చేసే స్వేఛ్చ ఉంది.. అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుపకొచ్చి వివాదాలు చేయడం సరికాదన్నారు.
బిజెపి సిద్దాంతం వల్ల మనకు నష్టమే ఎక్కువని.., అందరూ సమానమే అనే భావనతో ముందుకు సాగాలన్నారు. ఏపీలో రాష్ట్రంలో కమ్మ , రెడ్డి అనే డివిజన్ 2014నుండి బాగా వచ్చిందని.., గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్ ఉంటే.., ఇప్పుడు రెడ్డి డామినేషన్ ఉందన్నారు. గతంలో ముసుగుండేదని.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారన్నారు ఉండవల్లి. ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుందని.., అధికారం కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇమేజ్ ఉండి, ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించాలన్నారు. ఐతే నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ ను ఆశ్రయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ది తప్పని తేలితే శిక్షిస్తారని.., అతనే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుందని ఉండవల్లి అన్నారు. ఈడి కేసులలో పెద్ద శిక్షలు పడటం తాను చూడలేదన్న ఆయన.., జగన్మోహన్ రెడ్డి కి అయినా జరిమానాలే పడతాయని చెప్పారు. ఈడి కేసులు వినడం ప్రారంభమైతేనే శిక్ష ఖరారు అవుతుందని.., ఈకేసుల వల్ల జగన్ పొలిటికల్ ఫ్యూచర్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారాయన. నాడు, నేడు కె.ఎ పాల్ కి ఎంతో తేడా ఉందని.. ఎందరో దేశాధ్యక్షులతో పరిచయాలున్న ఆయన ఇప్పుడు ఓ జోక్ అయిపోయారన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ విజయం సాధిస్తుందని తాను భావించడం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Pawan kalyan, Undavalli Arun Kumar, Ys jagan