ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (YS Jagan) పై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా (Bonda Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బొండా ఉమా.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని.. ప్రజలకు రాష్ట్రానికి మళ్ళీ మంచిరోజులు రావాలని... శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంతఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. తనపైనే కాకుండా.. ప్రతిపక్ష నేతల నుంచి ప్రజల వరకు అందరిపై రాష్ట్ర ప్రభుతం దాడులు చేయిస్తోందని బొండా ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకొక మహిళపై అత్యాచారాలు జరుగుతున్నాయని.., దేశంలోనే అత్యధిక సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. ఈ మాటను టీడీపీ చెప్పలేదని., నేషనల్ బ్యూరో ఆప్ క్రైమ్ నివేదిక ద్వారా చెప్పారని గుర్తు చేశారు.
ఇక వైసీపీ నాయకులు తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ బొండా ఉమా ఘాటుగా విమర్శించారు. టీడీపీ హయాంలో ఆధ్యాత్మిక భావన తిరుమలలో ఉండేదని.., శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను సైతం దోచుకుంటున్నారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగాలన్నారు.
ఈ క్రమంలో సీఎం జగన మతంపైనా బొండా ఉమా సంచలన కామెంట్స్ చేశారు. బయట కండువా.., లోపల శిలువ వేసుకొని తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ఏనాడు సతీసమేతంగా ఆలయానికి రాలేదని.. ఇదే పెద్ద ఉదాహరణ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. త్వరలోనే టీడీపీ సుపరిపాలన రాక తప్పదని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతమార్పుడిలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీతో పాటు బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. పాస్టర్లకు గౌరవవేతనం ఇచ్చే అంశంతో పాటు చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులివ్వడం, ప్రముఖ ఆలయాల వద్ద అన్యమత ప్రచారం, ఆలయాలపై దాడుల వంటి ఘటనల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ కుటుంబ మతం విషయంలోనూ ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం జగన్ తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు సతీసమేతంగా రాకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి.
ఐతే ఇటీవల జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన గోశాలలోనూ ఆమె పూజలు చేశారు. తాజాగా తిరుమలలో బొండా ఉమా చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఐతే ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.