ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రావెల.. చివరికి పార్టీ విడుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన, విధానాలకు ఆకర్షితుడినై పార్టీలోకి వచ్చానని తెలిపారు. దేశంలో ఆర్ధిక, సామాజిక అసమానతలు తగ్గి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా నిలవడంతో ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు రావెల తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల పార్టీలో కొనసాగలేకపోతున్నానని రావెల స్పష్టం చేశారు.
గతంలో రావెల కిశోర్ బాబు ఐఆర్టీఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. అప్పట్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని పార్టీ నాయకత్వం భావించింది. దీంతో మంత్రివర్గం నుండి రావెల కిషోర్ బాబును చంద్రబాబు తొలగించారు. మంత్రి పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన రావెల కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
బీజేపీకి రావెల కిశోర్ బాబు రాజీనామా
తర్వాత 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే రావెల జనసేనను వీడి.. బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న కొత్తలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. అయితే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఐతే కుటుంబ కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రావెల తన రాజీనామా లేఖలో పేర్కొన్నా.. ఆయన పొలిటికల్ ప్లాన్స్ మాత్రం వేరే ఉన్నాయంటున్నారు గుంటూరు జిల్లా జనం. రావెల కిషోర్ బాబు మళ్లీ టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం సాగుతుంది. ఆయన ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పత్తిపాడు నుండి పోటీచేయడానికి సిద్ధమవుతున్నారని రావెల కిశోరె సన్నిహితులు చెప్తున్నారు. ఐతే అధికార వైసీపీ మాత్రం ఈ విషయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. చంద్రబాబు తన వాళ్ళను బీజేపీలోకి పంపి అవసరాలు తీర్చుకుంటున్నారని.. అందులో భాగంగానే రావెల బీజేపీకి వెళ్లారని.. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వెళ్లబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.