ఓ వైపు టీడీపీ (TDP) మహానాడు (Mahanadu-2022) జరుపుకుంటుంటే.. వైసీపీ (YSRCP) మాత్రం టీడీపీ గట్టిగానే ఎటాక్ చేస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani).. చంద్రబాబు (Chandrababu) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దశమగ్రహమంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను గద్దె దించడానికి చంద్రబాబు జీవితం సరిపోదన్నారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్ళే, దండలు వేయడం ఉన్మాదమేనన్నారు. 2019లోనే ప్రజలు టీడీపీకి సమాధి కట్టినా.. ఇంకా రాష్ట్రాన్ని జలగలా పట్టుకున్నారని మండిపడ్డారు. అమలాపురం విధ్వంసం.. బాబు, నిక్కర్ల పార్టీ బ్యాచ్ పన్నాగమేమని ఎద్దేవా చేశారు. బాబు దృష్టిలో ఆ నలుగురే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలన్న నాని.. ఎన్టీఆర్ పార్టీ లాక్కొన్ని ఆయన్ను బయటకు గెంటేశాడని ఆరోపించారు.
మహానాడు పేరుతో, శత జయంతి ఉత్సవాల పేరుతో పార్టీలో మిగిలి ఉన్న నాయకులు, కార్యకర్తల్ని నమ్మించటానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు కొడాలి నాని. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు చంద్రబాబును, టీడీపీని వెళ్ళగొట్టినా.. ఆయనకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదన్నారు. జగన్ ను అధికారం నుంచి దించడం మీ తరంకాకే, ఆ పార్టీలు, ఈ పార్టీలు కలిసి రావాలని అడుక్కునే చంద్రబాబు మా పార్టీని ఓడిస్తాడా..? అని ఛాలెంజ్ చేశారు.
ఎన్టీఆర్ కు తీరని ద్రోహం చేశాడు కాబట్టే, చంద్రబాబు నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నాడని కొడాలి నాని అన్నారు. ఆఖరికి కుప్పంలో కూడా ఎన్టీఆర్ పేరు వినపడితేనే వణికిపోతున్నాడని విమర్శించారు. రాజకీయంగా అడ్రస్ లేని వాళ్ళు కూడా మహానాడులో జగన్ కి తొడ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమలాపురంలో మా పార్టీకి చెందిన దళిత మంత్రి విశ్వరూప్, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళను చంద్రబాబే తగలబెట్టించాడని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు, ఇంకో నిక్కర్ల పార్టీ బ్యాచ్ తో కలిసి ఈ పని చేసి.., పైగా మా ఇళ్ళను మేమే తగలబెట్టించుకున్నామని నిందలు మోపడానికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా..? అని ప్రశ్నించారు.
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబుకు, టీడీపీకి రాజకీయ సమాధి కట్టారని.., చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు, ఓ వర్గం మీడియా రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టు పట్టారని కొడాలి నాని అన్నారు. “టీడీపీ మహానాడు అంటే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి, వేల మందిని తరలించి చేసుకునేది.. అటువంటి కార్యక్రమానికి సామాజిక న్యాయ భేరికి నక్కకు, నాక లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మీకు భయపడి మేం బస్సు యాత్ర పెట్టామని సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉంటూ, రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చే చంద్రబాబుకు సామాజిక న్యాయం గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం గురించి ఏం తెలుస్తుంది.” అని నాని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Kodali Nani