ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సీఎం జగన్.. కొంతమంది పాతవారిని కొనసాగిస్తూ.. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పార్టీ నేతల్లో చెలరేగిన అసంతృప్తులను వైసీపీ అధినాయకత్వం చల్లార్చింది. మంత్రి పదవి రానందుకు నిరాశ చెందినా.. తాము సీఎం జగన్(YS Jagan) చెప్పినట్టు నడుచుకుంటామని నేతలు చెబుతున్నారు. ఇక మంత్రి పదవి పోయినందుకు తనకు బాధలేదని.. తాను సీఎం జగన్ అడుగుజాడల్లోనే నడుస్తానని మాజీమంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని(Kodali Nani) కూడా ప్రకటించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్ కొడాలి నానిని కొనసాగిస్తారని చాలామంది భావించారు. ఏపీ మంత్రుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu), ఆయన తనయుడు లోకేశ్‌ను(Nara Lokesh) విమర్శించేవారిలో అందరికంటే ముందుండే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కొడాలి నాని.
అందులోనూ చంద్రబాబు సొంత సామాజికవర్గమైన కమ్మ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో.. కొడాలి నానికి సీఎం జగన్ మరోసారి మంత్రిగా అవకాశం ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం ఇవ్వలేదు వైసీపీ అధినేత. కొడాలి నానికి మాత్రమే కాదు.. అసలు మంత్రివర్గంలో కమ్మ సామాజికవర్గం నాయకులెవరినీ తీసుకోలేదు. తన రాజకీయ వ్యూహంలో భాగంగానే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతున్నా.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కొడాలి నానికి తీవ్ర ఇబ్బందిగా మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలు కేబినెట్లో కమ్మ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోవడంతో.. ఆ వర్గం నుంచి కొడాలి నాని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ కమ్మ వర్గానికి పూర్తిగా వ్యతిరేకమనే ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి ప్రచారం జరిగినప్పుడల్లా కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేశ్, టీడీపీ, ఇతర మీడియా సంస్థలపై తీవ్రంగా ధ్వజమెత్తేవారు. జగన్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని గట్టిగా వాదించేవారు.
AP Cabinet: కూరలో కరివేపాకులా కీలక జిల్లా.. సీఎం జగన్ నిర్ణయంపై వైసీపీ నేతల షాక్..
కానీ తాజాగా మంత్రివర్గ విస్తరణలో కమ్మ వర్గానికి పూర్తిగా ప్రాతినిథ్యం దక్కకపోవడంతో కొడాలి నాని సైలెంట్ అయ్యే పరిస్థితి నెలకొందనే చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం జగన్ కొడాలి నానికి బదులుగా మరో కమ్మ నేతకు కేబినెట్లో చోటు కల్పించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని.. ఈ అంశంపై విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు కొడాలి నానికి అవకాశం దక్కేదనే పలువురు భావిస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గం నుంచి తనను తప్పించడంతో పాటు కమ్మవారికి స్థానం లేకుండా చేయడం వల్ల కొడాలి నానిని సీఎం జగన్ మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani