ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినెట్ (AP New Cabinet) కొలువుదీరుతుండగా.. అధికార పార్టీలో మాత్రం అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పదవులు కోల్పయిన మంత్రులు, పార్టీకి సేవచేసినా మంత్రి పదవి ఇవ్వలేదంటూ కీలక ఎమ్మెల్యేలు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కేబినెట్లో ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి తనపై వేటు వేయడంపై సుచరిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, సుచరిత అభిమానులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమెను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆమె ఇంటికి వెళ్లగా.. తన రాజీనామా లేఖను ఆయన చేతిలో పెట్టారట.
సుచరిత రాజీనామా విషయాన్ని ఆమె కుమార్తె రిషిత కూడా స్పష్టం చేశారు. తన తల్లి ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారని.. పార్టీకి కాదని తెలిపారు. సుచరితను కలిసేందుకు వచ్చిన మోపిదేవిని కూడా సుచరిత అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం జగన్ కు, సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు పార్టీలో రెడ్లకో న్యాయం.. ఎస్సీలకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలినేని ఇంటికి సజ్జల వెళ్లి బుజ్జగించారని.. కానీ సుచరితను మాత్రం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది కార్యకర్తలు ఓ అడుగు ముందుకేసి సుచరితను తప్పించడం వెనుక సజ్జల కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. గౌరవం లేని చోట ఉండొద్దని.. మీ వెనుకే మేముంటామంటూ ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్యనాయకులు సుచరితతో అన్నట్లు సమాచారం. ఐతే పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చినా సుచరిత మాత్రం ఎవరితోనూ మాట్లాడలేది తెలుస్తోంది.
మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కదని తెలిసినప్పటి నుంచి ఆయన పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారాయన. సజ్జల రెండుసార్లు బాలినేని సజ్జల ఇంటికి వెళ్లినా ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో సజ్జల కాస్త అసహనంగా కనిపించారు. బాలినేనికి మద్దతుగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజీనామాకు సిద్ధమయ్యారు.
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తీవ్రఅసంతృప్తితో ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రాధాన్యత దక్కకపోవడంపై ఆయన వర్గం మండిపడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రిపదవి దక్కకపోవడంపై ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పార్టీ తీరుకు నిరసనగా జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.