AP POLITICS EX CENTRAL MINSTER ASOKH GAJAPATI RAJU DAUGHTER ADITHI GAJAPATI RAJU AGAIN ACTIVE IN VIZIANAGARAM NGS VZM
AP Politics: అదితికి అధినేత లైన్ క్లియర్.. పూర్తి యాక్టివ్ అయిన వారసురాలు
యాక్టివ్ అయిన అదితి
AP Politics: మొన్నటి వరకు రాజకీయాలో అంత ఆసక్తి లేదన్నారు.. పార్టీ కోరుకుంటున్నా.. కార్యకర్తలకు దూరంగానే ఉన్నారు. ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. పాలిటిక్స్ వద్దు పర్సనల్ లైఫే ముద్దు అనుకున్నారు. హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. అదే మాట అధినేతకు చెబుతూ వచ్చారు.. కానీ ఇప్పుడు సడన్ గా యాక్టివ్ అయ్యారు.. ఎవరు ఆమె..? అనుకుంటున్నారా..?
AP Politics: ఆమెకు రాజకీయ వారసత్వం ఉంది.. తండ్రి రాజకీయాల్లో చాలా సీనియర్ కూడా.. కేవలం జిల్లాలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగలరు.. అలాంటి ఆయన వారసురాలి వ్యవహారం.. ఇటు కేడర్ కు.. అటు పార్టీకి తలనొప్పిగా మారింది. జిల్లా రాజకీయాలను చూసుకోవాలని అధినేత కోరినా.. ఆమె తనకు అంత ఆసక్తి లేదని.. చెబుతూ వచ్చారు.. కార్యకర్తలు తమ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసినా.. ఆమె కలిసే ప్రయత్నం చేయలేదు.. హైదరాబాద్ లో సెటిల్ అయ్యి.. అన్నింటినీ వదిలేశారు.. కానీ ఇప్పుడు సడన్‌గా యాక్టీవ్ అయ్యారు. ఆమె ఎవరో కాదు.. మాజీ కేంద్ర మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ex Minster Asokh Gajapathi Raju) కూతురు. ప్రస్తుతం విజయనగరం (Vizianagaram)లో ఆమె వ్యవహారశైలి దేనికి సంకేతం?
ఆమె కుటుంబ చరిత్ర చూస్తే.. జిల్లా రాజకీయాలనే శాసించిన ఘనత ఉంది. జిల్లాలో టీడీపీని తన కనుసన్నల్లో నడుపుతున్న సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు.. రాజకీయంగా బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయన రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గాల్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో విజయనగరం ఎంపీ గా గెలిచి కేంద్ర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఎన్నికల్లో ఆయన రెగ్యులర్ స్థానమైన విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో మీసాల గీత (Meesala Geeta) ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో మీసాల గీత స్థానంలో అశోక్ వారసురాలు అదితి గజపతికి (Adithi Gajapathi) టీడీపీ అవకాశం ఇచ్చింది. అశోక్‌ను మళ్లీ విజయనగరం ఎంపీగా నిలబెట్టింది. అయితే ఫలితం ఇద్దర్నీ తీవ్రంగా నిరాశ పరిచింది. ఫ్యాన్ గాలి ముందు తండ్రి కూతురు ఇద్దరూ నిలవలేకపోయారు.
అయితే కేవలం ఓడిపోవడమే కాదు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత.. అశోక్ గజపతి కుటుంబాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మాన్సాస్ వివాదం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మాకెందుకు ఈ రాజకీయాలు అని ఆయన కుటుంబ సభ్యులు అనుకునే విధంగా వివాదాలు వెంటాడాయి.. చాలాచోట్ల అశోక్ గజపతి రాజుకు అవమానాలు ఎదురయ్యాయి. వ్యక్తిగతంగా కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కన్నారు. అయితే న్యాయస్థానాల ద్వారా ఆయన విజయం సాధించినా.. అధికార పార్టీ తీరుతో తలనొప్పులు తప్పడం లేదు. మరోవైపు వయోభారం కారణంగా ప్రతిపక్ష పాత్రను కూడా ఆయన యాక్టీవ్‌గా పోషించలేకపోతున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతి కూడా కొన్నాళ్లు పార్టీలో యాక్టివ్గానే ఉన్నా.. ఈ తలనొప్పులు ఎందుకు అనుకుని.. పార్టీకి దూరంగా ఉన్నారు.
కనీసం కార్యకర్తల్ని కలవట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశారు. చిన్న చిన్న సమస్య కోసం ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందించడం లేదు. తాను, రాజకీయాలు పట్టించుకోవడం లేదని, ఏదైనా ఉంటే తన తండ్రి అశోక్ గజపతితో మాట్లాడాలని చెప్పేవారని టాక్. జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న అదితి ఇలా వ్యవహరించడంతో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. రాష్ట్రమంతా టీడీపీ కమిటీలు వేస్తే ఈ నియోజకవర్గంలో మాత్రం ఆ ఊసేలేదు. ఓ వైపు అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే కోలగట్ల (MLA Kolagatla) ప్రజల్లోకి దూసుకుపోతుంటే టీడీపీ (TDP)లో మాత్రం నిస్తేజం కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో లోకల్ నేతలంతా హాజరైనా అశోక్ గజపతి, అదితి గజపతిలతో చంద్రబాబు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.
తనకు రాజకీయాలు ఆసక్తి లేదని, హైదరాబాద్ (Hyderabad)లో సెటిలవ్వాలనుకుంటున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆదితి చెప్పినట్టు సమాచారం. ఒక్కసారిగా షాకైన చంద్రబాబు.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. కుటుంబ చరిత్రను, కీర్తిని ముందుకు తీసుకుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేశారట. అందుకోసమైనా రాజకీయాల్లో ఉండాలని అదితికి నచ్చజెప్పారని సమాచారం.
చంద్రబాబు సూచనలతో సరే అని ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతోనియోజకవర్గ కమిటీలు వేసి ఆర్నెళ్లలో పార్టీని బలోపేతం చేయాలని అదితిని చంద్రబాబు ఆదేశించారని తెలుస్తోంది. అశోక్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి.. కొన్నాళ్లు ఆయనకు అండగా ఉండి క్యాడర్ ను ముందుకు తీసుకెళ్లాలని హితబోధ చేశారట. ఆ తర్వాత కూడా నిర్ణయంలో మార్పు లేకుంటే అప్పుడు ఆలోచిద్దామన్నారట చంద్రబాబు. మీటింగ్ తర్వాత విజయనగరం చేరుకున్న అదితి.. పార్టీలో యాక్టీవ్ అయ్యారని టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.