Big Shock to Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhr Pradesh Government) వర్సెస్ ఏపీ ఉద్యోగుల (AP Employees) వార్ పీక్ కు చేరుతోంది. ప్రభుత్వానికి మళ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు ఉద్యోగులు. అన్ని సంఘాలు కలిసి రాకపోయినా.. తగ్గేదే లే అంటున్నారు. వెంటనే తమ డిమాండ్లు తీర్చాల్సిందేనంటూ అల్టిమేటం ఇచ్చాయి. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే.. ఈనెల 9వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ప్రకటించాయి. నెల రోజుల దశల వారి ఉద్యమంతోనైనా ప్రభుత్వం దిగి వస్తుందేమో అని ఆశిస్తున్నామని.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 5వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ అల్టిమేటం జారీచేశారు ఉద్యోగ సంఘాల నేతలు. అలాగే దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది.
ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై తామే రెండు మెట్లు దిగి చర్చిస్తున్నట్టు తెలిపారు.
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 3 వేల కోట్ల మేర బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలను కలిసి పరిష్కరించుకుంటామని సజ్జల స్పష్టం చేశారు. నేడు జరిగిన చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. మరికొన్ని అంశాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వారి ఖాతాల్లోకి డబ్బు జమ.. ఎంతంటే..?
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని బొప్పరాజు మండిపడ్డారు. మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? వైసీపీ ప్రభుత్వాన్ని బొప్పరాజు ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Employees