దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలమైంది. మే 30న ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక్కడ మేకపాటి కుటుంబానికే మళ్లీ సీటు ఇవ్వాలని అధినేత జగన్ నిర్ణయించారు. అయితే మేకపాటి (Mekapati ) కుటుంబం నుంచి ఎవరైనా ఎన్నికల బరిలో ఉంటే ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. ముఖ్యంగా మేకపాటి గౌతమ్ రెడ్డికి పెద్దగా శత్రువులు లేరు. సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అలాగే ఆయన అన్ని పార్టీల్లో నేతలతో స్నేహంగా ఉంటారు. ఆయన ఇమేజ్ ప్రకారం ప్రధాన పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఆ సీటు పక్కగా ఏక గ్రీవం అవుతుందని అంతా భావించారు.
గౌతమ్ రెడ్డి (Gautham Reddy) మరణం తర్వాత ఆయన్ను అజాత శత్రువుగా కీర్తిస్తూ అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు. గౌతమ్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు గౌతమ్ తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.
కానీ అనూహ్యంగా మేకపాటికి పోటీదారు బయటకొచ్చారు. ఆయన ఇంకెవరో కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. పేరు బిజివేముల రవీంద్రా రెడ్డి. అయితే ఆయన ఇప్పటి వరకూ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం బీజేపీ నేతను అని చెప్పుకుంటున్నారు. మేకపాటి కుటుంబ సభ్యులపై ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కుదిరితే బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తానని..లేకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగుతానని అన్నారు.
బిజివేముల రవీంద్రా రెడ్డి బీజేపీ తరపున పోటీ చేసినా, ఇండిపెండెంట్‌గా బరిలో దిగినా పెద్ద తేడా ఏమీ ఉండదు. బీజేపీ ఇక్కడ అభ్యర్థి కోసం వెదుకుతున్నా.. స్థానికంగా తమ పేరు చెడగొట్టుకోవాలని ఎవరికీ లేదు. అందుకే పోటీకి వెనకాడుతున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈ సమయంలో వారికి బిజివేముల దొరికారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) సైతం ఆత్మకూరు ఎన్నికపై కీలక ప్రకటన చేశారు. ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. దీంతో గతంలో ఇతర పార్టీలు పోటీ చేయని ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన విధంగానే.. ఆత్మకూరులోనూ బీజేపీ పోటీ చేస్తుందేమో అనే చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.