ఏ రాజకీయ పార్టీకైనా అధికారం ముఖ్యం. అధికారంలోకి రాకపోయినా, అధికారం చేతిలో లేకపోయినా ఆ పార్టీ మనుగడ చాలా కష్టం. లీటర్లు వెళ్లిపోవడం, క్యాడర్ కు దిక్కులేకపోవడంతో ఇబ్బందులు తప్పవు. ఇక ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (TDP) ది ప్రత్యేక స్థానం. 40ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019లో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఐతే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజానికి ప్రతిపక్షం అంటే అధికార పార్టీ కన్నా ఎక్కువ బిజీగా ఉండాలి. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూనే.. ఎక్కడ ఏం జరుగుతుందనే దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి, చంద్రబాబుకు లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఎన్నికలకు రెండేళ్లే ఉంటుండటం పార్టీ వ్యూపాలు సరిగ్గానే ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది.
ప్రస్తుతం అసెంబ్లీలో సాంకేతికంగా టీడీపీ బలం 23.. గెలిచిన వారిలో కొందరు పార్టీ మారిపోగా.. మరికొందరు సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్న 23 మందినే గాడిలో పెట్టలేక చంద్రబాబు తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా సమస్యను లేవనెత్తుతున్న పార్టీ దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే చెప్పొచ్చు. ఈ చిన్న ఇష్యూ వచ్చినా టీడీపీ చేసే ఆరోపణలకు అధికార పార్టీ గట్టిగానే రియాక్ట్ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రాజధాని విషయం తప్ప మిగిలిన ఏ అంశాన్ని కూడా టీడీపీ పెద్దగా జనంలోకి తీసుకెళ్లలేదు.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగానూ మార్చలేకపోయింది. రాజధాని రైతుల ఉద్యమాన్ని కూడా అమరావతికే పరిమితం చేయడంలో వైసీపీ ఒకింత సక్సెస్ అయింది. చాలా అంశాల్లో వైసీపీకి కోర్టు నుంచే సమస్య ఎదురైంది తప్ప టీడీపీ నుంచి కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతం వైసీపీ ఖాతాలో 151 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. టీడీపీకి 20 మంది బలం కూడా లేరు. మరీ తమకంటే 130 స్థానాలు ఎక్కువగా ఉన్న పార్టీని గద్దెదించాలంటే వ్యూహారు మరింత పదునుగా ఉండాలి. 2014 ఓటమి తర్వాత గెలుపును సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్.. రెండేళ్ల ముందే పాదయాత్ర చేసి గెలుపుకు బాటలు వేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతల్లో అలాంటి అలోచన కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సమస్యలపై చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు.
ఇక నాయకత్వాన్ని బలోపేతం చేసే విషయంలో టీడీపీ చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇప్పటికీ వైసీపీపై విమర్శలు చేయాలంటే అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలే కనిపిస్తున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలైన తర్వాత అనిత చురుగ్గా కనిపిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ తప్ప యువనాయకుల పాత్ర పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తు నాయకుడిగా ప్రచారంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. జగన్ స్థాయిలో జనం దృష్టిని ఆకర్షించలేకపోతున్నారనేది వాస్తవం. పార్టీ వ్యూహాల్లో, నాయకత్వ బలోపేతం విషయంలో సీరియస్ గా లేకపోతే మరోసారి టీడీపీకి చావుదెబ్బ తప్పదని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.