టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ (Narayana Arrest) ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ కక్షసాధింపేనంటూ ప్రతిపక్ష టీడీపీ (TDP) విమర్శలు గుప్పిస్తోంది. తమ పార్టీ వారిని కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇలాంటి విమర్శలెదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తప్పుచేస్తే ఎవరినైనా వదిలిపెట్టం అన్న చందంగానే తన సొంతకుటుంబానికి చెందిన వ్యక్తిపైనా కఠిన చర్యలు తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత వైఎస్ కొండా రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుసుకున్నారు. బెద్రింపుల కేసులో అరెస్టయిన వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించారు. సొంత పార్టీ నేత, అందునా బంధువుపై కఠిన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.
నంద్యాల జిల్లా చాగలమర్రి-అన్నమయ్య జిల్లా రాయచోటి మధ్య 143 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డును ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. ఇందుకు ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ కాంట్రాక్టర్ రవికుమార్ రెడ్డికి చెందిన ఎస్ఆర్కే కన్ స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. ఇదిలా ఉంటే కడప జిల్లా చక్రాయపేట మండల పరిధిలోని 4 కిలోమీటర్ల పనుల్లో తనకు షేర్ ఇవ్వాలంటూ వైసీపీ మండల ఇన్ ఛార్జ్, పులివెందులకు చెందిన సీఎం జగన్ బంధువైన వైఎస్ కొండారెడ్డి డిమాండ్ చేశారు. చనకు వాటా ఇవ్వకుంటే పనులు జరగనివ్వనని బెదిరింపులకు గురిచేశాడు.
ఐతే రోడ్డు కాంట్రాక్టర్ రవికుమార్ రెడ్డికి.. కర్ణాటక మంత్రి శ్రీరాములు వియ్యంకుడు. దీంతో విషయం శ్రీరాములు వరకు వెళ్లింది. అక్కడి నుంచి బీజేపీ అగ్రనేతలకు చేరింది. హైవే పనుల్లో లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవడంతో ఇష్యూ మరింత సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో కొండారెడ్డిని అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో జిల్లా పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం కొండారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా.. గురువారం ఆయనకు బెయిల్ వచ్చింది. ఐతే కొండారెడ్డికి క్రిమినల్ చరిత్ర ఉండటంతో అతడ్ని జిల్లా నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్.. కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
కొండారెడ్డి విషయంలోనూ సీఎం జగన్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు ఆయనపైనే కఠిన చర్యలకు ఆదేశించడంతో వారి నోళ్లు మూయించినట్లయింది. తప్పుచేస్తే తనకు ఎవరైనా ఒకేటనని సీఎం జగన్ నిరూపించారంటూ వైసీపీ నేతలంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.