CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మదనపల్లెలో బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయాలు జమచేశారు. దీంతో మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం మీద ఇప్పటి వరకు జగనన్న విద్యాదీవెన (Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) పథకాల కింద 12,401 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి రెండు మాటలు చెబుతాను అంటూ.. విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్ ఐనిస్టిన్ చక్కగా చెప్పారన్నారు. కానీ ఈ రోజు రాజకీయ విషయాల్లోకి వస్తే ఈ రోజు కొరబడిన అలాంటి ఆలోచన శక్తి, కొరవడిన వివేకం ప్రతిపక్షాలకు ఎప్పటికైనా రావాలి. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోరుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అన్నారు.
ఈ రోజు ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయంటే ఫలాన ప్రాంతంలో, ఫలాన పొలాలను ఫలానా రేటుకు అమ్ముకునేందుకు, ఆ భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి వీళ్లందరూ కూడా బయట పడేలా వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని పంచిపెట్టాలని దేవుడిని కోరుకునే పరిస్థితి ఉందన్నారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని వాదించే మెదళ్లను మార్చాలని, వీరికి మంచి ఆలోచనలు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే ఈ పెత్తాందార్లు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బటన్ నొక్కి ప్రజలకు మంచి జరిగితే వీళ్లకు పుట్టగతులు ఉండవని బాధపడుతున్నారన్నారు. జగన్ బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఇదే రాష్ట్రంలో వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అని దుష్ప్రచారం చేస్తూ నిసిగ్గుగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే వీరికి ఇంకితజ్ఞానం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు.
ఇదీ చదవండి: పొత్తులపై అప్పుడే నిర్ణయం.. నేతలకు పవన్ ఏం చెప్పారంటే..?
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు .. అధికారంలో ఉన్నప్పుడు రైతులను మోసం చేశారని.. ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. పిల్లలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఈ రోజు విద్యారంగం గురించి మాట్లాడడం దారుణమన్నారు. అక్కచెల్లెమ్మలను దగా చేసిన ఈ బాబు మహిళా సాధికారత గురించి మాట్లాడడంతో జనాలు నవ్వుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందార్లమనస్తత్వాలు ఉన్న ఇలాంటి బాబులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఇలాంటి వాళ్లను నమ్మనే నమ్మొద్దని కోరుతున్నాను అని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
కేవలం ఒక్కటే కొలమానం తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ యుద్ధం చేస్తున్నది మంచి వాళ్లతో కాదు. రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని దయచేసి గుర్తు పెట్టుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes, Chitoor