సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఉన్నక్రేజ్ అందరికి తెలుసు. నటుడిగా తనకున్న ప్రజాభిమానంతో ఎంతో పేరు, డబ్బు సంపాధించారు. అయితే రాజకీయాల్లో మాత్రం చిరంజీవి రాణించలేకపోయారు. సొంతగా పార్టీ పెట్టినా...కాంగ్రెస్‌లో కీలక పదవి చేపట్టినా అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయినా పాలిటిక్స్(Politics)పైన ఆయనకు మక్కువ తగ్గలేదని తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అర్ధమవుతోంది. ఎలాగైనా తాను సాధించలేకపోయిన దాన్ని తన సోదరుడు పవన్ కల్యాణ్(Pawan kalyan)సాధిస్తే చూద్దామని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలకు అర్ధం అదేనంటున్నారు మెగా అభిమానులు, రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో రాణించడం ఆషామాషి వ్యవహారం కాదని చిరంజీవి అనడం చూస్తుంటే పొలిటిషియన్‌గా తాను ఓడిపోయానని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు చిరు. తన ఓటమిని అంగీకరించిన చిరంజీవి ..తన సోదరుడ్ని మాత్రం ఏదో ఒక రోజు కీలకమైన స్థానంలో చూస్తామని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
మా తమ్ముడు నెగ్గుతాడు..
మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. రాజకీయాల్లో ఇమడలేక తిరిగి నటన రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన అనుభవం ఉన్నప్పటికి ఆయనలో రాజకీయంగా శాసించే పదవి చేపట్టలేకపోయానే అనే బాధ ఉంది. రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెనక్కి వచ్చిన చిరంజీవి ..తన ఆశలన్ని తమ్ముడు పవన్ కల్యాణ్‌పై పెట్టుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీ అల్ముని వెల్ ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన పూర్వ మిత్రుల సమ్మేళనంలో మెగాస్టార్ చేసిన పొలిటికల్ కామెంట్సే ఇందుకు ఉదాహరణ.
పొలిటికల్ స్టేట్మెంట్..
చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ పార్టీల్లో కొత్త గుబులు పుట్టిస్తున్నాయి. తాను ఓడిపోయానని ఒప్పుకున్న మెగాస్టార్ తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం అనుకున్నది సాధించి తీరుతాడనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజల అభిమానం, మద్దతుతో ఏదో ఒక రోజు కీలకమైన స్థానంలో చూస్తామని చెప్పడం చూస్తుంటే పవన్ కల్యాణ్ సీఎం కావాలని చిరంజీవి కలలు కంటున్నారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఎక్కడైనా కీ రోల్ పోషిస్తారని..
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున మొదటి సారి రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒకచోట గెలిచి మరో చోట ఓడిపోయారు. అయితే ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీ తరపున తొలి ప్రయత్నంలోనే పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయినప్పటికి తనకంటే తన సోదరుడే మొండివాడని..అనుకుంటే సాధిస్తాడని చెప్పడం చూస్తుంటే పవన్ కల్యాణ్‌తో చేతులు కలపాలని ముందుకు వస్తున్న వాళ్లను చూసే చిరంజీవి ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని ఏపీలో బీజేపీ , టీడీపీ పోటీ పడుతున్నాయి. ఈక్రమంలోనే చిరంజీవి వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో కీలక పదవి వస్తుందని ..టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో చక్రం తిప్పే స్థాయికి వెళ్తారని చిరంజీవి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఏమో చూద్దాం..
మరి చిరంజీవి అన్నట్లుగా తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ ఎదురుదెబ్బలు తిని రాటుదేలతారో లేక .. ఈసారి ఎన్నికల్లో కూడా జనసేనకు ఆశించిన స్థాయి సీట్లు రాకపోతే అన్నయ్య బాటలోనే సినిమాలు చేసకుంటారో చూడాలి అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.