ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి అంశం చర్చకు వచ్చినప్పుడల్లా కేంద్రం నుంచి వచ్చే నిధులు, పన్నుల వాటాల అంశాలు హైలెట్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రెవెన్యూ లోటుపై లెక్కలతో సహా వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చే పన్నుల వాటాలపై స్పష్టతనిచ్చింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కేంద్ర పన్నులలో వాటా కింద ఎపీకి 1,20, 875 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలపారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వివరాలను వెల్లడించారు, 2018-19 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు ప్రత్యక్ష పన్నుల కింద ఏపీ లప్రభుత్వం నుంచి వచ్చిన నికర వసూళ్ళు రూ.1,29,267 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఇది కాకుండా పైన తెలిపిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వసూలైన మొత్తం లక్షా 11 వేల 312 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ కింద ఏపీ నుంచి మొత్తం రూ.2,40,579 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం వసూలు చేసిన పన్నులలో ఏపీ వాటాగా ఇచ్చింది లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలని మంత్రి వివరించారు.
ఏపీలో లక్ష కోట్ల సాగరమాల ప్రాజెక్టులు
సాగరమాల కార్యక్రమం కింద రాష్ట్రంలో లక్ష కోట్ల విలువైన 120 ప్రాజెక్టులను గుర్తించినట్లు పోర్ట్స్, అండ్ షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో రేవుల చుట్టు పక్కల పారిశ్రామీకరణకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగు పరచడం, రేవులను ఆధునీకరించడం, రేవులకు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, కోస్టల్ షిప్పింగ్, జలరవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను సాగరమాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, మేజర్ పోర్ట్లు అమలు చేస్తాయని మంత్రి చెప్పారు. సాగరమాల కార్యక్రమం కింద ఏపీలో రూ.1,380 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. అందులో రూ.754 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు పూర్తయ్యాయని.., రూ.316 కోట్ల విలువైన 3 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రూ.310 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులు ఇంకా ప్రారంభించాల్సి ఉందని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో సాగరమాల కార్యక్రమం కింద రూ.5.5 లక్షల కోట్లతో 800 ప్రాజెక్టులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.