Anna Raghu, News18, Amaravati (Code: GNT)
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చెనంట అన్నచందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జనసేన (Janasena) - టీడీపీ (TDP) ల మధ్య పొత్తుల వ్యవహారం. జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేరు చెబితేనే అంతెత్తున ఎగిరి పడుతున్న మోదీ-షా ద్వయం 2024 లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే తాము గెలిచినా ఓడినా టీడీపీని భూస్థాపితం చెయ్యవచ్చనే ఆలోచనలో ఉన్నారట. అదే గనుక జరిగితే 2029 నాటికి వైసీపీ (YSRCP) కి తమకూటమే ప్రధాన ప్రత్యర్ధిగా ఉంటుందని అప్పటికి సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగి తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దల భావనగా ఉందట.
ఎటొచ్చీ ఇప్పటికి రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సారి ఎలాగైనా సరే తాము ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని దీని కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసివచ్చే పార్టీలు అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అదీ కాక టీడీపీ మాత్రం ఈ సారి కి త్యాగం చేయవలసిందేనని పరోక్షంగానైనా కుండ బద్దలుకొట్టి మరీ చెప్పాడు. అంతేకాదు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా.. ప్రజావాణి పేరుతో జనం సమస్యలపై దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
మెజారిటీ ఓటుబ్యాంక్ ఉన్న తెదేపా ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ కు అప్ప జెపుతారా అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఐతే రాజకీయంగా సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ చంద్రబాబు నాయుడు గనుక పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా గనుక అంగీకరిస్తే వారి మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉంది.
ఇప్పటికైతే భాజపాతో కలిసి ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ తెదేపాతో గనుక పొత్తుకు సిద్ధపడితే భాజపా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.ఇప్పటికైతే జనసేన -వైసీపీల మధ్య ఉప్పు నిప్పులా ఉన్నా బీజేపీ మాత్రం అటు జనసేన ఇటు వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. పవన్ చంద్రబాబులు ఒక్కటైన పక్షంలో బీజేపీ పవన్ న్ని పక్కన పెట్టి వైసీపీకి మద్దతు ఇవ్వవచ్చనే అభిప్రాయమూ లేకపోలేదు. అది వైసీపీకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. పైగా ఇక్కడా టీడీపీ-జనసేన కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ ఎలాగూ తన మార్క్ రాజకీయంతో అధికారం కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం మహరాష్ట్ర (Maharashtra) లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దీనికి ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
ఎటొచ్చి బీజేపీ నమ్ముకుని అధికారం కోసం మరో ఐదేళ్ళు ఓపిక పట్టడమా, లేక చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి తొందరపడటమా అనేది పవన్ కళ్యాణ్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏవిధమైన నిర్ణయం తీసుకున్నా అంతిమంగా బీజేపీ అనుగ్రహం మాత్రం తప్పనిసరి అనేది కాదనలేని సత్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp-janasena, Janasena party, TDP