ఏపీలో ఏదో విధంగా పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీకి రాయలసీమ వెనుకబాటుతనంతో పాటు తిరుమల వివాదాలు కూడా కలిసి వస్తున్నాయా ? రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల వెనుక కారణం ఇదేనా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాయలసీమ విషయంలో ప్రస్తుతం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోందని తాజా పరణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమ దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించాలనే ప్రయత్నాలు.. కర్నూలులో ఏపీ హైకోర్టు నెలకొల్పే విషయంలో పరిశీలిస్తున్నామన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలు.. తిరుమలలో అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా, అన్యమత ఉద్యోగుల విషయంలోనూ జగన్ సర్కారు వేగంగా వేస్తున్న అడుగులు.. సొంత గడ్డ రాయలసీమలో తనను ఇరుకున పెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ గా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల సూచికలే ఇవి. కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమలో బలపడేందుకు తమకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఇప్పుడు ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని జారవిడిచేందుకు సిద్ధంగా లేదు. అందుకే కర్నూలులో హైకోర్టు డిమాండ్లతో పాటు తిరుమల వ్యవహారాలను కూడా ఎగదోసేందుకు శతవిథాలా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా జగన్ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన జగన్ ముఖ్యమంత్రి అయినా పరిస్ధితిలో ఏమాత్రం మార్పు లేదని అక్కడి ప్రజలకు గుర్తుచేసేందుకు కాషాయ దళం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఇదంతా గమనిస్తున్న సీఎం జగన్.. కాషాయ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తెరచాటుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎంతో గోదావరి జలాలను శ్రీశైలం తరలించే ప్రతిపాదనపై వరుసగా చర్చలు జరుపుతున్నా, కర్నూలులో హైకోర్టు నెలకొల్పే అంశం పరిశీలనలో ఉందని తనకు నమ్మినబంటు బుగ్గనతో చెప్పించినా, తిరుమలలో అన్యమత ఉద్యోగులపై తీసుకుంటున్న చర్యలను రాష్ట్రంలో ఇతర గుళ్లకూ వర్తింపజేసినా అందులో బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్న కోణమే కనిపిస్తోంది. అదే సమయంలో కొత్తగా నెలకొల్పే పరిశ్రమలను కూడా రాయలసీమకే కేటాయించేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమరావతి-అనంతపురం కారిడార్ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు జగన్ సర్కారు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇవన్నీ రాయలసీమలో మొన్నటి ఎన్నికల్లో పూర్తిస్దాయిలో లభించిన ఆధిపత్యం వైసీపీ చేజారిపోకుండా ఉండేందుకే అన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ పోరులో సీమలోని 52 స్ధానాల్లో టీడీపీ కేవలం మూడు స్ధానాలకే పరిమితం కావడంతో వైసీపీ భారీగా ఆధిపత్యం సాధించినట్లయింది.
దీన్ని భవిష్యత్తులో చేజారకుండా చూడాలన్నా, బీజేపీ రాకను అడ్డుకోవాలన్నా తిరుమల వ్యవహారాల్లో సైతం ఆ పార్టీకి పట్టు దక్కకుండా చేసేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ పగ్గాలు అందించడం వెనుక వ్యూహం కూడా ఇదేననే ప్రచారం సాగుతోంది. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు అన్యమత ఉద్యోగుల విషయంలో తీసుకుంటున్న చర్యలు జగన్ భవిష్యత్ వ్యూహానికి సంకేతంగా నిలుస్తున్నాయి.
- న్యూస్18 సీనియర్ కరస్పాండెంట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, Ap cm ys jagan mohan reddy, Bjp, Rayalaseema