Anna Raghu, News18, Amaravati
నిన్న మొన్నటి వరకు సాఫీగా సాగిపోతున్న వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP New Cabinet) పెద్ద దుమారమే రేపింది. తాజాగా మాజీలైన మంత్రులు, మంత్రి పదవి ఆశించి భంగపడిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత, సీఎం జగన్ (AP CM YS Jagan తీరుపట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఐతే ఇప్పటికిప్పుడు అధికార పార్టీని ధిక్కరించే సాహసం వారు చేయకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం వీరి నుండి పార్టీకి కొంతమేర నష్టం జరగవచ్చంటున్నారు విశ్లేషకులు. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన ఒకరిద్దరు మాజీలు పదవిపోయిన బాధలో కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. ఐతే అలాంటి వారిని పిలిచి బుజ్జగించటం ఏ పార్టీలో ఐనా సాధారణంగా జరిగేదే. ఐతే మొన్నటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయినవారు.., పదవులు ఆశించి భంగపడినవారి విషయంలో అధినేత వ్యవహరించిన తీరు వారికి పుండుమీద కారంచల్లినట్లుగా ఉందట.
శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తామని ప్రకటించిన అసంతృప్తులను బుజ్జగించడం మానేసి మీ రాజీనామాలు వీలైనంత త్వరగా ఆమోదింపజేసుకుని అవసరమైతే ఉపఎన్నికలకు వెళతాం అని అధిష్టానం వారికి హెచ్చరికలు పంపిందని వినికిడి. దీంతో దెబ్బకు ఎవరికి వారు తమంతటతాముగా మీడియా ముందుకు వచ్చి తమలో అసంతృప్తి లేదని, జగన్ నిర్ణయమే తమ నిర్ణయం అని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధం అని సన్నాయినొక్కులు నొక్కడం ప్రారంభించారు. అధికారంలోఉన్నవారితో విభేధించి మరింత నష్టపోవడం తప్ప తాము సాధించేదేమీ లేదని వారి భావన.
గత ప్రభుత్వంలో మంత్రిగా రాజకీయ జీవితం మంచి ఊపుమీద ఉన్నప్పుడు చంద్రబాబును వ్యతిరేకించి మధ్యలోనే మంత్రిపదవి పోగొట్టుకుని,ఇప్పుడు రాజకీయాలలో ఉండీలేనట్టుగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే తన రాజకీయభవిష్యత్తుని తానే నాశనం చేసుకున్న రావెల కిశోర్ బాబు ఉదంతాన్ని వారు ఉదాహరణగా తీసుకున్నారనిపిస్తుంది. అందుకే అధికారపార్టీతో విభేధించి తమ రాజకీయ జీవితం నాశనం ఎందుకని ఎవరికి వారు సర్దుకు పోతున్నారట.!
ఐతే రానున్న రోజులలో మాత్రం తమకి విలువలేకుండా చేసిన జగన్ &కో ను అదును చూసి దెబ్బకొట్టాలనేది వీరి ఆలోచన అంటున్నారు అనుచరగణం. ఇదే అదునుగా ఎప్పటినుంచో ఏపీ రాజకీయాల్లో తమ పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ అసంతృప్తులకు గాలం వేసేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవిని ఆశించి భంగపడిన వారితో పాటు మంత్రిపదలువు దక్కినప్పటికీ తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిగా ఉన్న ఆయా నేతలను బీజేపీ నేతలు టచ్ లో పెట్టుకుంటున్నారట. అటు పవన్ ఒక్కడినే నమ్ముకుంటే పెద్దగా ప్రయోజనం లేదని, అధికార పార్టీ అసంతృప్త నేతలు తమవైపు చేరితే సంస్థాగతంగా పార్టీ బలోపేతమౌతుందనేది కమలనాథుల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటికిప్ఫుడు కాకపోయినా 2024 ఎన్నికలనాటికి మాత్రం ఖచ్ఛితంగా తమతో కలుస్తారని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Ysrcp