ప్రముఖ రాజకీయ విమర్శకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arun Kumar) పై బీజేపీ (BJP) నాయకులు విరుచుకుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీపై అసంబద్ధ ప్రేలాపనలు ఆపాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న అరుణ్ కుమార్ నిత్యం బీజేపీపై ఆరోపణలు చేస్తూ ఉంటారని, అది మంచి పద్ధతి కాదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా తీసేసిన తహసీల్దార్ సలహాలు మానేసి కిందపడిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి లేపై ప్రయత్నాలు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కొత్త పార్టీ పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ సమాలోచనలకు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఉండవల్లి అక్కడ వెళ్లారు. ఆ తర్వాత కేసీఆర్‌తో భేటీ వివరాలను సోమవారం మీడియా సమావేశంలో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు. బీజేపీ విధివిధానాలు దేశానికే ప్రమాదమని.. బీజేపీకి వ్యతిరేకంగా అన్నీ పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వివరించారు.
అయితే, ఈ సమావేశంలో ఉండవల్లి బీజేపీపై విమర్శలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ నిజంగానే అంత తెలివైన వ్యక్తి అయ్యుంటే కింద పడ్డ కాంగ్రెస్‌ను లేపే ప్రయత్నం చేయాలంటూ చురకలు అంటించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానంటూనే.. ప్రతీ రోజూ ఏదో ఒక విషయంలో భారతీయ జనతా పార్టీపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని, అందుకే 2014, 2019లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని.. 2024లోనూ బీజేపీదే అధికారమని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు.
ఉండవల్లి అరుణ్‌కుమార్ ఊసరవెల్లి రాజకీయాలు కట్టిపెట్టి.. కాంగ్రెస్ పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పటికైనా తీసేసిన తహసీల్దార్లా సలహాలు ఇవ్వడం మానుకోవాలని చురక అంటించారు. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) కోసం పనిచేయాలని విష్ణు హితవు పలికారు. జాతీయ రాజకీయాపై మంచి పట్టున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ (YSR) కు మంచి విధేయుడిగా మెలిగారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణ చేయడం ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Undavalli Arun Kumar