ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలం నుంచి సొంత పార్టీ మీద అసంతృప్తితో ఉన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో(Nadendla Manohar) భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana)అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటుడటంతో.. ఆయన పార్టీ మారే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారేమో అనే చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో (Somu Veerraju) కన్నా లక్ష్మీనారాయణకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఏపీలో బలపడేందుకు జనసేన చాలాకాలం ప్రయత్నిస్తోంది.
బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి కొత్త ఊపు వస్తోందని లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏపీలో బీజేపీ , జనసేన కలిసే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళుతుందనే వార్తలు కూడా వినిపించాయి.
ఈ క్రమంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించాలని జనసేన భావిస్తోందని.. ఈ వ్యూహంలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను జనసేనలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నా లక్ష్మీనారాయణకు గ్యాప్ ఉందనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. రెండు నెలల క్రితం ఏపీ బీజేపీ నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
AP-BRS: ఏపీలోని మాజీ అధికారిపై బీఆర్ఎస్ ఫోకస్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..
AP Politics: పెట్టుబడుల విషయంలో దుష్ప్రచారం.. విపక్షాలపై మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి
పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉన్నదని, ఇప్పుడది బయటకు వచ్చిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారేమో అనే వార్తలు జోరందుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kanna Lakshmi Narayana, Nadendla Manohar