టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chied Nara Chandra Babu Naidu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో (Kuppam) బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఘన విజయం సాధించింది. కుప్పంలోని 25 వార్డులకు గానూ ఇప్పటికే ఒక వార్డును ఏకగ్రీవం చేసుకోగా.. మరో 12 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మొత్తం 13 వార్డులను కైవసం చేసుకొని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. చంద్రబాబు సొంత మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు షాకిచ్చామని వైసీపీ నేతలంటున్నారు. కుప్పంలో టీడీపీని ఓడించి తీరుతామని చెప్పిన వైసీపీ ఆ మాటను నిలబెట్టుకుంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Rama Chandra Reddy).. అక్కడే మకాం వేసి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో మూడు నెలలుగా వైసీపీ ముఖ్యనేతలు ఇక్కడ మకాం వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబమంతా కుప్పంలోనే పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో విజయం సాధించారు. ప్రజల్లో చంద్రబాబపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లోనూ షాక్
కుప్పంలో చంద్రబాబు ఆధిపత్యానికి వైసీపీ గండి కొడుతూ వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గానూ 69 చోట్ల వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించగా.. అలాగే 63 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొని చంద్రబాబుకు షాకిచ్చింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో వైసీపీ సక్సెస్ అయింది. ప్రచారంలో టీడీపీ వెనకబడిపోవడం, స్థానిక నేతల మధ్య విభేదాలు ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తోంది. ఎన్నికల కంటే ముందు చంద్రబాబు కుప్పంలో పర్యటించి తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేసినా ఫలితం లేకపోయింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లోనూ వైసీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 12 మున్సిపాలిటీలకు గానూ 8 మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా రాయచోటి, కమలాపురం, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, TDP, Ysrcp