ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ (Narayana Arrest) ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యేనని ప్రతిపక్ష టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. సంబంధంలేని మేటర్లో ఇరికించారంటూ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu).. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) కి రాసిన లేఖ సంచలనంగా మారింది. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ లేఖరాశారు. సంఘ విద్రోహశక్తులు, నేరస్థులతో తనకు ప్రాణహాని ఉందని అచ్చెన్న తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు 1+1 భద్రత కల్పిస్తుండగా దానిని 4+4కు పెంచాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు అచ్చెన్న.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు తాను ప్రజల్లోకి వెళ్తున్నానని.. అలాగే తాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష ఉపనేతగానూ ఉన్నందున అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.
అచ్చెన్న రాసిన లేఖ సంచలనంగా మారింది. నారాయణ అరెస్టయిన రోజే అచ్చెన్న లేఖ రాయడం, ఏకంగా ప్రాణహాని ఉందని పేర్కొనడం చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడుకి ఎవరి నుంచి ప్రాణహాని ఉంది..? దీనిపై ఆయనకు సమాచారముందా..? అచ్చెన్నను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనేది చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఆయన పెరిగిన ధరలపై పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఏమైనా రెక్కీ జరిగిందా..? రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పుంటుందని భయపడుతున్నారా..? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే గతంలో అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోలులో తనకు కావాలసిన వారికి లబ్ధిచేకూర్చేలా అచ్చెన్న వ్యవహరించారంటూ గతంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. సర్జరీ చేయించుకుని ఇంటికే పరిమితమైన అచ్చెన్నను అరెస్ట్ చేసి నాయకీయ పరిణామాల మధ్య విజయవాడ తరలించగా.. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది.
ఇక అచ్చెన్న రాసిన లేఖకు సీఎం జగన్, డీజీపీ స్పందిస్తారా.. లేక లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తనకు ప్రాణహాని ఉందని కామెంట్ చేయడంతో ఆయనకు భద్రత పెంచారు. కానీ ప్రభుత్వం పంపిన గన్ మెన్లను ఆయన వెనక్కి పంపారు. మరి అచ్చెన్న విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.