AP POLITICS AP TDP CHIEF ATCHANNAIDU SLAMS CM JAGAN OVER CABINET RESHUFFLE ALLEGES REDDY COMMUNITY DOMINATION MKS GNT
AP New Cabinet: రెడ్డి షాడోలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. జగన్ కొత్త కేబినెట్‌పై అచ్చెన్న ధ్వజం
జగన్, అచ్చెన్నాయుడు
సామాజిక న్యాయం ప్రాతిపదికన కొత్త వారికి పదవులు ఇచ్చినట్లు వైసీపీ చెప్పుకోగా, జగన్ తొలి నుంచీ రెడ్డి పక్షపాతి అని, సామాజిక న్యాయానికి వ్యతిరేకి అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
(Anna Raghu, News18, Guntur)
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రతిపక్ష టీడీపీ నిప్పులు చెరిగింది. సామాజిక న్యాయం ప్రాతిపదికన కొత్త వారికి పదవులు ఇచ్చినట్లు వైసీపీ చెప్పుకోగా, జగన్ తొలి నుంచీ రెడ్డి పక్షపాతి అని, సామాజిక న్యాయానికి వ్యతిరేకి అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు. సామాజిక అన్యాయం తప్ప.. సామాజిక న్యాయం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని, సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడంపైనే శ్రద్ద చూపారని విమర్శించారు. ఈ మేరకు అచ్చెన్న ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు..
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై జగన్ ఏనాడూ చూపింది లేదని, ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడమేనా చేసిన సామాజిక న్యాయమా అని, వేలాది మంది బడుగు, బలహీన వర్గాల మీద కేసులు పెట్టి, బెదిరింపులు, వేదింపులు, హత్యలు, అవమానాలకు గురి చేయడమేనా మీరు సాధించిన సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లాలో దళిత మంత్రి నారాయణస్వామికి కుర్చీ కూడా ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అవమానించి.. ఆయనను కన్నీటి పర్యంతం చేయడం సామాజిక న్యాయమా? దళిత, మహిళా హోం మంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డిని షాడో మినిస్టర్ గా నియమించి హోం మంత్రిని డమ్మీని చేయడం సామాజిక న్యాయమా.? ఉత్తరాంధ్రకు సామంతరాజుగా మీ అవినీతి భాగస్వామి, ఏ2 విజయసాయిరెడ్డి నియమించి.. అక్కడి మంత్రులు, ఎమ్మల్యేలను డమ్మీలను చేయడం సామాజిక న్యాయమా.? ఇలా చెప్పుకుంటూ పోతే.. బీసీలు ఛైర్మన్లుగా నియమించబడిన తిరుపతి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహా.. ఇతర మున్సిపాలిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లన్నింటికీ సొంత సామాజిక వర్గాన్ని షాడోలుగా నియమించడమే సామాజిక న్యాయమా.? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
జగన్ రెడ్డి తన అవినీతిని విస్తరించుకునేందుకు తప్ప.. బలహీనవర్గాలకు కేబినెట్ విస్తరణతో ఒరిగేదేమీ లేదు. దొంగ కంపెనీలు, తప్పుడు లెక్కలు, మోసపు మాటలు చెప్పడం వైసీపీ నేతలకు జె-బ్రాండ్స్ తో పెట్టిన విద్య. రాష్ట్ర కేబినెట్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించామని చెబుతున్న జగన్ రెడ్డి.. ఏ ఒక్కరినైనా స్వతంత్రంగా పని చేసే వీలు కల్పించారా.? ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకి, ఛైర్మన్లు, ఇంఛార్జులు అందరికీ రెడ్లను షాడోలుగా నియమించి వారిని వెన్నెముక లేని వారిగా చేయడమేనా మీరు చేసిన సామాజిక న్యాయం.? ఒకవైపు షాడోలతో డమ్మీలను చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలకు కేబినెట్లో 70 శాతం అవకాశాలిచ్చామని చెప్పడం ద్రోహం కాదా.? బడుగు, బలహీన వర్గాలను ముందు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి రాజ్యాంగేతర శక్తులను షాడో మినిస్టర్లుగా ప్రోత్సహించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమానించడం కాదా.? అని ఏపీ టీడీపీ చీఫ్ అన్నారు.
టీడీపీ హాయాంలో నియమించిన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రుల శాఖల్లో ఎవరూ జోక్యం చేసుకోలేదని తెలుసుకోవాలి. సామాజిక న్యాయంపై చర్చకు సీఎం జగన్ రెడ్డి సిద్ధమా? ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, కోస్తాలో సజ్జాల రామకృష్ణారెడ్డి, రాయలసీమలో వైవీ సుబ్బారెడ్డిని ఇంఛార్జులగా నియమించి.. అన్ని వర్గాలకు చెందిన ప్రజాప్రతినిదుల్ని డమ్మీలుగా పెట్టి.. వారి వారి వెనక రెడ్లతో వసూళ్ల కౌంటర్లు పెట్టారని అచ్చెన్న ఆరోపించారు.
CPI(M): సీపీఎం సంచలనం.. చరిత్రలో తొలిసారి దళిత నేతకు చోటు.. కార్యదర్శిగా మళ్లీ సీతారాం ఏచూరి
టీటీడీ ఛైర్మన్ పదవిని రెండు సార్లు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం ఏం సామాజిక న్యాయం.? గత ప్రభుత్వ హాయాంలో ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిలో బీసీని నియమిస్తే మీరు రెడ్లకు కట్టబెట్టారు. తుడా చైర్మన్ సైతం రెడ్లకే కట్టబెట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీల వాటా ఎంత? సలహాదారుల్లో అధిక భాగం ఎవరికిచ్చారు? నామినేటెడ్ పదవులు, ఉద్యోగాల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను అణగదొక్కడం కాదా.? అని అచ్చెన్న నిలదీశారు.
మూడేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో తీవ్రమైన ద్రోహం చేసి.. వారి వ్యతిరేకత నుండి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు పదవుల పేరుతో రాజకీయం చేస్తున్నారు. మూడేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఏం బాగుపడ్డాయో చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా.? ఏ వర్గమైనా జగన్ రెడ్డి అమలు చేశానంటున్న సామాజిక న్యాయంతో బాగుపడినట్లు చూపగలరా.? బడుగు బలహీన వర్గాల విషయంలో ఎన్నిరకాల కుప్పి గంతులేసినా, తిమ్మిని బమ్మిని చేసేలా ఎంత ప్రచారం హోరెత్తించినా.. వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు కర్రు కాల్చి జగన్ రెడ్డికి వాతలు పెట్టడం తధ్యమని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.