హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ysrcp-Guntur: గుంటూరు వైసీపీలో నేతల మధ్య విభేదాలు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ..

Ysrcp-Guntur: గుంటూరు వైసీపీలో నేతల మధ్య విభేదాలు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP News: ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అధిష్టానం ఇప్పటి నుండే ఆయా నియోజకవర్గాలపై ధృష్టి పెట్టాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.గత ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 17 నియోజకవర్గాలలో వైసీపీ(Ysrcp) 15 నియోజకవర్గాలలో విజయకేతనం ఎగురవేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం అప్పటికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళగిరి,తాడికొండ,పెదకూరపాడు నియోజకవర్గాలలో వైసీపీ(Ysrcp) శాసనసభ్యులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సమాచారం. రాజధాని అమరావతి (Amaravati) పరిధి లోని ఈ మూడు నియోజకవర్గాలలో వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన.మంగళగిరి లో ప్రస్తుత శాసన సభ్యుడు ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి చాలాకాలంగా ముభావంగా ఉంటున్నారు.కారణాలు ఏవైనా కానీ ఆర్కే సైలెంట్ అవ్వడం మంగళగిరిలో వైసీపీ పూర్తిగా నైరాశ్యం లో మునిగి పోయింది అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఇదే జిల్లాలోని వినుకొండ,నరసరావపేట,గురజాల,చిలకలూరిపేట నియోజకవర్గాలలో పరిస్థితి మరోలా ఉంది.ఈ నాలుగు చోట్ల పోటీ చేసి గెలిచిన నలుగురూ ఆయా నియోజకవర్గాలలో మాజీ శాసనసభ్యులు,సీనియర్ల అండదండలతో గెలిచిన వారే.వీరంతా ఎన్నికలకు ముందు సీనియర్లను నెత్తిన పెట్టుకొని తిరిగి గెలిచాక మాత్రం వారిని పూర్తిగా పక్కన పెట్టేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే చిలకలూరిపేటలో మంత్రి విడదల.రజని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడిందని స్థానిక వైసీపీ నాయకుల మాట.మర్రి కి మండలి స్థానం దక్కకుండా మంత్రి ఇన్నాళ్ళూ మోకాలడ్డారనేది ఆయన వర్గం వాదన.మర్రి రాజశేఖర్ సౌమ్యుడు కావడంతో పాటు పార్టీకి ఆయన చేసిన సేవలు ధృష్టిలో ఉంచుకుని జగన్ ఇన్నాళ్ళకు ఆయనకు మండలిలో ప్రవేశించే అవకాశం కల్పించారు.ఈ సారి ఎన్నికలలో మాత్రం విడదల రజనీ పోటీలో ఉంటే మర్రి రాజశేఖర్ వర్గం ఆమెకు సహకరించడం అనుమానమే.

ఇక వినుకొండ నుండి శాసన సభ్యునిగా గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడుకి మాజీ శాసన సభ్యుడు మక్కెన.మల్లిఖార్జునరావు వర్గం పూర్తిగా సహకరించింది. అయితే బ్రహ్మనాయుడి మొండి వైఖరి, ముక్కుసూటితనం తో మక్కెన వర్గం పూర్తిగా సైలెంట్ ఐపోయింది.పైపెచ్చు పార్టీ పదవులలో కూడా వారికి సరైన ప్రాధాన్యం దక్కలేదనే ప్రచారమూ లేకపోలేదు.ఇక నరసరావుపేట నియోజకవర్గంలో పూర్తిగా రాజకీయాలకు కొత్తయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా రెండుసార్లు గెలవడంలో కాసు కుటుంబం అండదండలు ఉన్నాయనేది అక్కడి వైసీపీ క్యాడర్ చెప్పే మాట. నరసరావుపేటలో కాసు కుటుంబ ముద్ర చెరిపేసేలా శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారనేది కాసు అభిమానుల వాదన. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలో కాసు క్రిష్టారెడ్డిని కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టనీయలేదని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై కాసు క్రిష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సైతం తీవ్రమైన కోపంతో ఉన్నారని కాసు కుటుంబ సన్నిహితుల నుండి వినిపిస్తున్న మాట.ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి స్వయంగా కాసు ఇంటికి వెళ్ళి ఆయనను కలిసి వివరణ ఇచ్చినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది అంటున్నారు ఇక్కడి వైసీపీ నేతలు.

ఇక గురజాలలో పరిస్థితి మరోలా ఉంది.స్థానికేతరుడైనా సరే గురజాలలో పోటీ చేసి గెలిచిన కాసు.మహేష్ రెడ్డికి గురజాల మాజీ శాసనసభ్యుడు జంగా క్రిష్ణ మూర్తి వర్గం పూర్తిగా సహకరించిందనే చెప్పాలి.ఇక మహేష్ కోసం తన సీటును వదులుకున్న జంగాకి కానుకగా ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీతో పాటు మండలిలో విప్ గా అవకాశం కల్పించారు.ఐతే నియోజకవర్గంలో మాత్రం కాసు - జంగా వర్గాల మధ్య అంతర్యుధ్ధం నడూస్తుందనే ప్రచారం జరుగుతుంది.ఈ సారి శాసన సభ సీటు జంగా క్రిష్ణమూర్తికి కానీ లేదంటే స్థానికంగా తమలోనే ఎవరోఒకరికి ఇవ్వమని ఆ ప్రాంత నాయకులు కోరే అవకాశం ఉందనే ప్రచారము లేకపోలేదు.

YS Jagan: ‘విశాఖ’ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా ?

Janasena-Bjp: జనసేన , పవన్ కళ్యాణ్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు..

ఇక ప్రత్తిపాడు శాసన సభ్యురాలు మేకతోటి.సుచరిత తన మంత్రి పదవి పోవడంతో పార్టీ పై బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్లగక్కారు. అప్పటి నుండి ఆమె పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ సారి ఆమెకు వైసీపీ నుండి బిఫామ్ దక్కడం అనుమానమే అంటున్నారు వైసీపీ వర్గాలు.ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు గెలుపు కష్టమే అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఇప్పటికే ఆయనకు పార్టీలోని రెడ్డి సామాజికవర్గం దూరం జరిగిందనే ప్రచారమూ లేకపోలేదు.పైగా ఈ సారి అంబటికి సత్తెనపల్లి నుండి పోటీచేసేది కూడా అనుమానమే అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు.అదే జరిగితే కొత్తగా వచ్చేవారికి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు స్వాగతం పలుకుతాయోననే అనుమానం స్థానిక వైసీపీ క్యాడర్ లో నెలకొంది.

ఇంకా రకరకాల సమస్యలతో పాటు సహజంగా అధికారపార్టీలో ఉండే అసంతృప్తులు,వర్గ పోరు కారణంగా ఆయా నియోజకవర్గాలలో పార్టీ విజయావకాశాలను దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అధిష్టానం ఇప్పటి నుండే ఆయా నియోజకవర్గాలపై ధృష్టి పెట్టాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ysrcp